27-04-2025 01:00:19 AM
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి)/ గజ్వేల్: వచ్చేనెలలో కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు కసరత్తు జరుగుతున్న సమయంలో ప్రాజెక్టుకు సం బంధించి కీలక పరిణామం జరిగింది.
కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ, గజ్వేల్ ఈఎన్‌సీ భూక్య హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీ బీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు నమోదు చేసి అదుపు లోకి తీసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) తుది నివేదిక ఇచ్చిన రెండు రోజుల్లోనే ఏసీబీ దాడులు జరగడం గమనార్హం. హైదరాబాద్ టోలిచౌకీలోని ఆదిత్య టవర్స్‌లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల దాడులు కొనసాగాయి. కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీ కరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించారు.
హరి రాం భార్య అనిత కూడా నీటిపారుదలశాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె వాలంతరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని పలుచోట్ల విల్లాలు, అమరావతిలో వాణిజ్యస్థలం ఉన్నట్లు గుర్తించారు. గజ్వేల్‌లోని 32 ఎకరాల భూమి పత్రాలతో పాటు ఇతర ఆస్తుల డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించి అందులో ఉన్న డాక్యుమెంట్లు, నగ దు, నగలను అధికారులు లెక్కిస్తున్నారు.
మర్కూక్ తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు..
ఈఎన్సీ హరిరామ్ ఆస్తులపై సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఏసీబీ దాడులు కొనసాగాయి. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్‌స్పెక్టర్లు కొండా రమేశ్, వెంకటేశ్వర్లు, సిబ్బంది తనిఖీలు చేపట్టగా.. మర్కుక్, ములుగు తహసీల్దార్లు ప్రవీణ్‌రెడ్డి, ఆరీఫా, సిబ్బంది వారికి సహకరించారు. మొదటగా మర్కూక్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు రెండు టీమ్‌లుగా మారారు. తహసీల్దార్ కార్యాలయంలో 2017 నుంచి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు.
2022 వరకు రెవెన్యూ రికార్డులు పరిశీలించగా ఇరిగేషన్ ఈఎన్‌సీ హరిరామ్ సతీమణి, డిప్యూటీ ఈఎన్సీ అనిత పేరు తో మూడు డాక్యుమెంట్లలో 32 ఎకరాల భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయా భూములను క్షేత్రస్థాయికి వెళ్లి ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పరిశీలించారు. ఆదివారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది.