calender_icon.png 25 November, 2024 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరమే కాంగ్రెస్‌కు దీపం

25-11-2024 01:44:34 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హుజూరాబాద్, నవంబరు 21: తమ హయాంలో నిర్మించిన కాళేశ్వరం కూలిపోయిందని అపవాదు వేసిన కాంగ్రెస్‌కు కాళేశ్వరమే దీపం అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌లో మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు.

కాళేశ్వరమే కూలిపోతే హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం 20 టీఎంసీలు అవసరమవుతుందని, కాలేశ్వరం నుంచి టెండర్లు పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎలా చెప్పారని ప్రశ్నించారు. మంత్రులే గడిచిన పదేళ్లలో తెలంగాణలో అత్యధికంగా వ్యవసాయ ఉత్పత్తులు జరిగాయని, కాళేశ్వరం నుంచి లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తామని ఎలా చెప్పారని అన్నారు.

రేవంత్‌రెడ్డికి అబద్ధాలు ఆడటంలో డాక్టరేట్ ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటీ సంపూర్ణంగా పూర్తి చేయలేదని విమర్శించారు. దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారని అన్నారు.

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు.  తెలంగాణలో ప్రజాసామ్యం ఖూని అయిందని, అరాచకమే నడుస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇలాకాలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని అన్నారు.

19 జూలై 2024 ఫార్మాసిటీకి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వెంటనే ఫార్మాసిటీని రద్దు చేసి రైతులను ఆదుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాగా హుజూరాబాద్‌లో రెండవ విడత దళితబంధు కోసం ధర్నాకు దిగిన దళిత కుటుంబాలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో దళితులకు అండగా ఉంటూ వారి సమస్యలపై నిలదీస్తామని చెప్పారు. సమావేశంలో హుజూరా బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రా వు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్‌రావు, హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.