- జస్టిస్ పీకే ఘోష్ కమిషన్ గడువు పెంపు
- ఈ ఏడాది చివరి వరకు పెంచుతూ ఉత్తర్వులు
- ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లకు క్రాస్ ఎగ్జామినేషన్
- బీఆర్‌ఎస్ ముఖ్యులనూ విచారించే అవకాశం
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీకే ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. విచారణ పూర్తి కాలేదని.. గడువు పెంచాలని కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోస్ కమిషన్ విచారణ ఈ నెల 20వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. విచారణలో భాగంగా ఘోష్ రెండు వారాల పాటు హైదరాబాద్‌లోనే ఉంటారని అధికారులు తెలిపారు.
20 నుంచి ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచే క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టాలని నిర్ణయించినా.. కమిషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఆలస్యంగా ఉత్తర్వులిచ్చింది.
గత ప్రభుత్వ ముఖ్యులకూ నోటీసులు
ఇప్పటి వరకు అధికారులు, ఇంజినీర్లు, సాగునీటి రంగ ప్రముఖులను విచారించిన కమిషన్ ఇకపై ఐఏఎస్ అధికారులు, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తయితే ఇకపై జరిగే విచారణ అత్యంత కీలకం కానున్నది.
మూడో విడత విచారణలో ప్రస్తుత, రిటైర్డ్ ఐఏఎస్‌ల విచారణలో ఎస్‌కే జోషి, రజత్‌కుమార్, సోమేశ్‌కుమార్, స్మితాసబర్వాల్, వికాస్ రాజ్ తదితరులను ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అప్పటి సాగునీటి మంత్రి హరీశ్‌రావు, రెండో విడత సాగునీటి శాఖను చూసిన కేసీఆర్‌ను సైతం విచారణకు పిలిపించే అవకాశం ఉందని అధికారు లు చెబుతున్నారు. ఈనేపథ్యంలో మూడో విడత విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.