calender_icon.png 26 April, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేలో కాళేశ్వరం తుది నివేదిక!

25-04-2025 01:29:28 AM

  1. ముమ్మరంగా కసరత్తు
  2. 400 పేజీల నివేదిక.. 90 శాతం మేర పూర్తి
  3. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక కోసం కమిషన్ ఎదురుచూపు

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణకు ఏర్పాటయిన కాళేశ్వరం కమిషన్ మే రెండో వారంలో లేదా కాస్త అటుఇటుగా తన తుది నివేదికను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించి దాదాపుగా కసరత్తు పూర్తిచేసిన కమిషన్, ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక కోసం ఎదురుచూస్తోంది.

కాగా.. కాళేశ్వరం కమిషన్ విచారణ గురువారం నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈసారి బహిరంగ కోర్టు ద్వారా ఎవర్ని విచారణకు పిలువకపోయినా, నివేదికను సిద్ధంచేసే కసరత్తు చురుగ్గా జరుగు తోందని సమాచారం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం బరాజ్‌ల నిర్మాణాల అవకత వకలపై ఏర్పాటైన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే ఐఏఎస్, ఇంజి నీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించింది.

వీటితో పాటు ప్రభుత్వం, వివిధ ఏజెన్సీల నుంచి తీసుకున్న పత్రాల ఆధారంగా 400 పేజీల నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇప్పటికే దాదాపు 90 శాతం రిపోర్టును పూర్తిచేసినట్టు తెలుస్తోంది. ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక ఇంకా అందని నేపథ్యంలో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించేందుకు కమిషన్ సిద్ధమవుతుందని తెలుస్తోంది.

అందుకే ఇప్పటికే ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక కోసం కమిషన్ మరోసారి లేఖ రాసింది. ఆ నివేదిక ఈ నెలాఖరుకు కానీ లేదా మే మొదటివారంలో గానీ వచ్చే అవకాశం ఉందని, నివేదిక అందిన తర్వాత కమిషన్, సర్కార్‌కు తుది నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా గతేడాది మార్చి 12న ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందించడంలో ఇప్పటికే ఆలస్యమైందని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటివరకు పలుమార్లు కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో రెండు నెలల వరకు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అయితే చివరి దఫా విచారణలో కీలకమైన మాజీ సీఎం కేసీఆర్ సహా మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను సైతం విచారణకు పిలుస్తారని తెలుస్తోంది. కానీ ఎప్పుడనేది ఇంకా వెల్లడి కాలేదు.