- కమీషన్ల కోసమే గత సర్కారు ప్రాజెక్టు నిర్మాణం
- కాళేశ్వరం పంపులన్నీ పనిచేస్తే రూ.13వేల కోట్ల కరెంటు బిల్లు
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 20(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరంను నిర్మించిందని విరుచుకుపడ్డారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో మరమ్మతులు చేసైనా ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని చూస్తున్నట్టు తెలిపారు. కాళేశ్వరంను కేసీఆర్ కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని దుయ్యబట్టారు. ఎక్కువ కమీషన్లు పొందాలనే ఆశతో ప్రాజెక్టు రీడిజైన్ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టు కూడా పెరగలేదని ఆయన అన్నారు.
ఐదేళ్లలో కేవలం 13 టీఎంసీలు మాత్రమే...
ఐదేళ్లలో 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని, ఈ లెక్కన ఏడాదికి సగటున కేవలం 13 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారని మంత్రి పేర్కొన్నారు. కాగ్ రిపో ర్ట్ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.1.24 లక్షల కోట్లు ఖర్చయినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సు మారు రూ.కోటిన్నర లక్షలకు ప్రాజెక్టు ఖర్చు పెరుగుతుందన్నారు. అన్ని పంపులు నడిస్తే కరెంటు బిల్లే రూ. 13వేల కోట్లు అవుతుందన్నారు. లక్ష కోట్ల పెట్టుబడిపై పదివేల కోట్ల వడ్డీ అంటూఎద్దేవా చేశారు. ఎన్డీఎస్‌ఏ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రెండున్నర గంటలపాటు చర్చించినట్లు తెలిపారు. సోమవారం ఇంజి నీర్ల స్థాయిలో చర్చలు జరుగుతాయని వివరించారు.