calender_icon.png 28 September, 2024 | 12:58 AM

కాళేశ్వరం ఇంజినీర్లు మీకు ఆదర్శం కావొద్దు

27-09-2024 01:51:19 AM

మోక్షగుండం, నవాబ్ అలీ జంగ్ స్ఫూర్తిగా పనిచేయాలి

ఆర్‌అండ్‌బీ ఇంజినీర్ల ఓరియెంటేషన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ అలీ జంగ్ బహదూర్ వంటి ప్రముఖ ఇంజినీర్లను స్ఫూర్తిగా పనిచేయాలేగానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించిన ఇంజినీర్లను ఆదర్శంగా తీసుకోవద్దని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొ న్నారు. గురువారం హైటెక్స్ ప్రాంగణంలోని న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్)లో కొత్తగా ఎంపికైన 156 మంది ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజినీర్లకు నిర్వహిస్తున్న 5 రోజుల ఓరియంటేషన్ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని, కొందరు పాలకులు, అతికొద్దిమంది ఇంజినీర్ల స్వార్థం యావత్ ఇంజినీర్లందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు.  బీఆర్‌ఎస్ హయాంలో పది మండలా లకు ఒక్క ఇంజినీర్ కూడా అందుబాటులో లేని దుర్భర పరిస్థితులను ఆర్‌అండ్‌బీ శాఖ చూసిందన్నారు. 

కట్టిన వెంటనే కూలిపోయే ప్రాజెక్టులొద్దు

రాష్ర్టంలో కొన్ని ప్రాజెక్టులు కట్టిన వెంటనే కూలిపోయి ఇంజినీర్ల ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీశాయని, దయచేసి అలాంటి ఇంజినీర్లను కనీసం కలలోకి కూడా రానివ్వకండని మంత్రి కోమటిరెడ్డి సలహా ఇచ్చారు. విశ్వేశ్వరయ్య వంటి ఇంజినీర్లు రూపొందించిన ప్రణాళికలు నేటికీ మనల్ని రక్షిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కొత్త ఇంజినీర్ల పట్ల అత్యంత ఆశాభావంతో ఉందని, నిబద్ధతతో పనిచేస్తే రాష్ర్టం ప్రగతిబాట పడుతుందన్నారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రాష్ట్ర ప్రగతిలో కీలకమైన సూపర్ గేమ్ ఛేంజర్ లాంటి ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు, టిమ్స్ హాస్పిటల్ భవనాలు, జిల్లాల్లో పరిపాలనపరమైన భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.