22-12-2024 02:58:03 AM
వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు..
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని 3 బరాజ్‌ల పరిధిలో చోటుచేసుకున్న అక్రమాలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
డిసెంబర్ 31 వరకు కమిషన్‌కు గడువు ముగుస్తుండగా.. మరో రెండు నెలల పాటు (ఫిబ్రవరి 28వ తేదీ వరకు) గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది మార్చిలో రాష్ర్ట ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. కమిషన్ ఏప్రిల్ నుంచి విచారణ ప్రారంభించింది.
కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం కమిషన్‌కు 100 రోజుల గడువు నిర్దేశించింది. అయితే విచారణకు ఇచ్చిన గడువు సరిపోకపోవడంతో ప్రతి రెండు నెలలకు ఒకసారి పొడిగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విచారణ చివరిదశకు చేరుకుంది. ఇప్పటికే సాంకేతిక పరమైన విచారణ, ఆర్థ్ధిక, ప్రభుత్వ విధివిధానాల పరమైన విచారణను కమిషన్ దాదాపుగా పూర్తి చేసింది.
ప్రస్తుతం ఆర్థిక ముఖ్య కార్యదర్శి విచారణ సహా మరి కొంతమంది కీలక అధికారుల విచారణ కూడా ఉంటుందని సమాచారం. ఇప్పటికే దాదాపు 100మందికి పైగా వివిధ స్థాయి అధికారులను, ఇంజినీర్లను, నిపుణులను, వివిధ పార్టీలు, సంస్థల ప్రతినిధులను కూడా కమిషన్ విచారించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లు, పంప్ హౌస్‌ల నిర్మాణాలు, డిజైన్లు, నిధుల ఖర్చు వంటి వాటిల్లో జరిగిన అక్రమాలపై ఘోష్ కమిషన్ కీలక సమాచారంతో ఆధారాలను సిద్ధం చేసుకుని, గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు విషయంలో కీలకంగా ఉన్న కేసీఆర్, హరీష్‌రావులను కూడా త్వరలో విచారణకు పిలుస్తారని తెలుస్తోంది.