calender_icon.png 16 January, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక, ఎకో టూరిజం హబ్‌గా కాళేశ్వరం

16-01-2025 03:10:17 AM

  1. ‘కాళేశ్వరం- మంథని-రామగిరి’ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించండి
  2. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో అగ్రస్థానానికి సహకరించండి 
  3. ఢిల్లీలో కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అశ్వినీ వైష్ణవ్‌లకు ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి 

హైదరాబాద్, జనవరి 15(విజయక్రాంతి): ‘కాళేశ్వరం- మంథని- రామ గిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్‌గా గుర్తించి, అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. రామగిరి కోటకు సుమారు 1,200 ఏండ్ల చరిత్ర ఉందని, స్వదేశీ దర్శన్ 2.0 కానీ, ఇతర పథకాల కింద రామగిరి కోటను మెగా టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

బుధవారం ఢిల్లీలో సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను మంత్రి శ్రీధర్‌బాబు కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలన్నారు.  ఈ ఏడాది మేలో సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇక్కడే 2027లోనూ గోదావరి పుష్కరాలు జరగనున్నట్లు పేర్కొన్నారు.

సోమ్‌నాథ్, కేదార్‌నాథ్, మహాకాళేశ్వర్, అయోధ్య, కాశీ మాదిరిగా ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయాన్ని కూడా ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని కేంద్రమంత్రికి వివరించారు. అందుకే ఈ ఆలయం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించామని, దీనికి సహకరించాలని కోరారు.

సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో అగ్రస్థానం..

సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మంత్రి కలిశారు. ఈ సందర్భంగా సెమీ కండక్టర్ల ఉత్పత్తికి తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కేంద్రమంత్రికి ఆయన వివ రించారు. 

పలు సంస్థలు తెలంగాణలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయని,  ఈ క్రమంలో డేటా భద్రత అనేది కీలకంగా మారిందన్నారు. అందుకే నేషనల్ డిజాస్టర్ జోన్ ఏర్పాటు  చేయడం అనేది చాలా కీలకమని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఈ నెల 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని కేంద్రమంత్రిని శ్రీధర్ బాబు ఆహ్వానించారు.