లలితగీతాలు, దేశభక్తి గీతాల రచయితగా లబ్ధప్రతిష్ఠులైన వడ్డేపల్లి కృష్ణ ప్రామాణిక పరిశోధకుడిగా, టెలి విజన్ ధారావాహికల దర్శకుడిగా, సినీ గేయరచయితగా, వివిధ డాక్యుమెంటరీల రూపకర్తగా, అనేక పుస్త్తకాలతోపాటు ఆడియో ఆల్బమ్‌ల రూపకర్తగా, సంగీత, నృత్య రూపకాలు నాటకాల రచయితగా, విభిన్న పార్శాల్లో తన రచనా నైపుణ్యాన్ని ప్రజలకు అందించారు. వడ్డేపల్లి 1948 ఆగస్టు 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఓ సామాన్య చేనేత కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మమ్మ, లింగయ్య. బాల్యం నుంచే డా. సి.నారాయణరెడ్డి స్ఫూర్తితో సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకున్నారు.
‘సినారె వల్లనే తాను సినీరంగంలో అడుగుపెట్టినట్లు’ అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు. లలితగీతం, లక్షణం, నిర్వచనం నిర్దేశిస్తూ లలితగీతాలపై మొట్టమొదటిసారిగా ప్రామాణిక పరిశోధన చేశారు. తెలంగాణపై అభిమానంతో తెలంగాణ యాసతో ‘వెలుగచ్చిం ది’ నాటకం రాశారు. కరీంనగర్ క్షేత్రాలు పేరుతో ఆడియో సీడీ ని తెచ్చారు. ఆయన రాసిన వెయ్యికిపైగా లలితగీతాల్లో అనేకం ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.
అంతరించిన గోవులపై ‘గోభాగ్యం’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. ఇది ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో బహుమతులు గెలుచుకుంది. బతుకమ్మ, రామప్ప రమణీయం ఆత్మహత్య, నేతన్నలు వంటి డాక్యుమెంటరీలు తీసి జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు. అనేక లఘు చిత్రాలకు నంది అవార్డులు లభించాయి. టెలివిజన్‌లో భక్తపోతన, భారతీయ సంస్కృతీ శిఖరాలు వంటి సీరియల్స్‌కు దర్శకత్వం వహించి బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.
తెలంగాణకు తీరని నష్టం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ‘జయ జయహే తెలంగాణ’ నృత్య రూపకాన్నిరచించగా, అన్ని వేదికలపైనా అది ప్రదర్శిత మై, మార్మోగింది. అమెరికాలో జరిగే తానా, ఆటా వేడుకల్లో ప్రతి ఏటా సాహిత్య చర్చల్లోను పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ టీవీలో ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతోపా టు అనేక కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 1992లో బాలలమీద రాసిన ‘చిరుగజ్జెలు’ అనే గేయానికి బాల సాహత్య పురస్కారం అందుకున్నారు. ఈ గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పుణెలోని బాలభారతి స్కూలులో నాలు గో తరగతి తెలుగు వాచకంలో ఓ పాఠ్యాంశంగా చేర్చారు. వివేకానంద విజయం, విశ్వకళ్యాణం నృత్య రూపకాలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన రచించిన ‘విశ్వకళ్యాణం’ బెంగాలీ భాషలోకి అనువాదమైంది. తెంగాణ ఉద్యమంలోనూ వడ్డేపల్లి ప్రముఖ పాత్ర పోషించారు.
బహుముఖ ప్రజ్ఞావంతుడైన వడ్డేపల్లి సినీరంగంలోనూ తనదైన ముద్ర వేశారు. భానుమతి దర్శకత్వం వహించిన ‘రచయిత్రి’ కోసం ఆయన తన తొలిపాట రాశారు. కానీ, ఆ సినిమా ఆలస్యంగా విడుదల కావడంతో ‘ఏఎన్‌ఆర్ నటించిన ‘పిల్ల జమీందార్’ మొదటి సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఆ చిత్రంలో ఆయన రాసిన ‘నీ చూపులోన విరజాజి వాన’, ‘భైరవ ద్వీపం’ చిత్రంలో ‘అంబా శాంభవి’ వంటి గీతాలు కృష్ణ కు ఎంతో గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు 200కు పైగా పాటలు రాసిన ఆయన స్వయంగా రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’ చిత్రాన్ని ఆయన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన మరో చిత్రం ‘ఎక్కడికి వెళ్తుందో మనసు’లో సాయికుమార్ హీరోగా నటించారు. గతేడాది సూపర్ హిట్‌గా నిలి చిన ‘బలగం’ చిత్రంలో వడ్డేపల్లి కృష్ణ నటించడం విశేషం.
హైదరాబాద్‌లోని నాగోల్‌లో స్థిరపడిన వడ్డేపల్లి కొంతకాలం పోస్టుమ్యాన్‌గా పని చేశారు. కొన్నాళ్లుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం కన్ను మూశారు. రెండు రోజుల క్రితమే ‘తెలు గు సినీ రచయితల సంఘం’ ఆయనను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వడ్డేపల్లి మరణం తెలంగాణకేకాక తెలుగు సాహితీ లోకానికీ తీరని లోటు.
రామకృష్ణ