- పోర్టు సీఈవోకు నోటీసులు పంపాలి
- అక్రమ రవాణాకు డీప్ నెట్‌వర్క్
- పోర్టు సెక్యూరిటీ వైఫల్యంపై విచారణ
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కాకినాడ, నవంబర్ 29: కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా బియ్యం రవా ణా జరుగున్నట్లు ఆరోపణలు రావడంతో పోర్టు సీఈవోకు నోటీసులు పంపాలని ఏపీ డిప్యూటీ సీఎం అన్నారు. ఇటీవల పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు రవాణాకు చేస్తుండగా అధికారులు 640 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని ఆయన పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి వాటిని ఆపుతామని గతంలో తాను హామీ ఇచ్చినట్లు చెప్పారు. పోర్టు నుంచి అక్రమంగా బియ్యం రవాణా అవుతున్నట్లు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటినుంచో చెబుతున్నారని ఆయన వివరించారు.
పౌరసరఫరాల మం త్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 51 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారని పేర్కొన్నారు. పోర్టు నుంచి బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు వార్తలు రావడంతో మంత్రి మనోహర్ వచ్చి తనిఖీలు చేసినా అధికారులు ఎటుంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు నుంచి రవాణా అక్రమాలు జరగనివ్వబోమని చెప్పారు.
కాకినాడ పోర్టు స్మగ్లింగ్‌కు హబ్‌గా మారిందని ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్‌వర్క్ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. రేషన్ మాఫియా వెనక ఎవరున్నా వారిని వదలిపెట్టబోమని హెచ్చరించారు. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
పోర్టు నుంచి ఇన్ని అక్రమాలు జరుగుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్న పోర్టు సీఈవోకు నోటీసులు పంపాలన్నారు. రేషన్ బియ్యంతో పట్టుబడిన ఓడను సీజ్ చేయాలని ఆదేశించారు. పోర్టులో కేవలం సెక్యూరిటీ సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే ఉండడంతో భద్రతా వైఫల్యం ఏర్పడుతుందని, ఇది దేశ భద్రతకే ప్రమాదమన్నారు.
పోర్టులో మరింత భద్రత పెంచాలని కేంద్రాని లేఖ రాస్తానని తెలిపారు. రేషన్ దందాపై సీఐడీతోనా, సీబీఐతోనా ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెబుతామన్నారు. పోర్టు యాంకర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ఇక్కడి నుంచి సరుకులు మాత్రమే రవాణా జరగాలని పవన్ పేర్కొన్నారు.