రాజులు పోయారు.. రాజ్యాలు అంతరించాయి.. కానీ ఆనాటి కట్టడాలు నేటికి ఆకట్టుకుంటున్నాయి. కాకతీయుల కళా వైభవం చాటే ఆలయాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. అందులో ప్రముఖమైంది ఖమ్మంలోని కూసుమంచి. అచ్చం వరంగల్ వెయ్యి స్తంభాల గుడి మాదిరిగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.
కాకతీయ చారిత్రక కళా వైభవంగా విరాజిల్లుతోంది కూసుమంచిలోని పురాతన శివాలయం. కాకతీయ కాలంలో నిర్మించిన ఈ ఆలయం చారిత్రక కాల గర్భంలో కలిసి శిథిలమైంది. అయితే ఆలయ ప్రాముఖ్యతను గుర్తించిన స్థానిక పెద్దలు వెలుగులోకి తెచ్చారు. ఫలితంగా నిత్యం పర్యాటలకులతో కిటకిటలాడుతోంది.
కూసుమంచి మండల కేంద్రంలో 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంనాడు గణపేశ్వరాలయం నిర్మితమైంది. కాకతీయ రాజు గణపతి దేవుడు హయాంలో ఈ ఆలయం కట్టబడింది. కాకతీయ రాజుల కళా వైభవానికి మచ్చుతునక ఈ పురాతన ఆలయం. ఆనాటి కాలంలో లభించిన అతి పెద్ద రాళ్లను ఉపయోగించి దీనిని నిర్మించారు.
ఎక్కడా ఎటువంటి రసాయనాలు సున్నం, బంక మట్టి నిర్మాణంలో వినియోగించలేదు. కేవలం రాతి రాళ్లతోనే పూర్తిగా నిర్మించడం విశేషం. ఒక రాయిపై మరొకటి పేర్చి ఎంతో కళాత్మకంగా.. ఆనాటి సామాజిక పరిస్ధితులకు అద్దంపడుతూ నిర్మాణం సాగింది. ఈ ఆలయం వరంగల్ వెయి స్తంభాల గుడికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అంతేస్థాయిలో నిర్మాణం జరిగింది కూడా.
రాతి రాళ్లతో..
ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకే కన్ను, ఒకే కాలు, ఒకే చేయి ఉన్న వ్యక్తి ఆలయాన్ని నిర్మించారనే కథ ప్రచారంలో ఉంది. అందుకే ఆలయం నిర్మాణంలో కూడా పెద్ద పెద్ద రాతి రాళ్లనే వాడారు. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద శివలింగంగా పేర్కొంటారు. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా శివలింగంపై పడటం ఆలయం విశిష్టతను తెలియజేస్తోంది.
అలా వెలుగులోకి
1999 కాలంలో ఆలయంలోని ముక్కంటి చిన్న దీపారాధనకు కూడా నోచుకోలేదు. ఆలయం గబ్బిలాలతో నిండి చీకటిగా ఉండేది. కనీసం అక్కడ శివాలయం ఉందన్న సంగతిని కూడా గుర్తించలేదు. పొలాల మధ్యలో పిచ్చి చెట్ల మధ్యలో ఉండేది. దారి కూడా లేదు. అయితే నాడు కూసుమంచి సీఐగా పని చేసిన సాధు ప్రతాపరెడ్డి ఆలయ విశిష్టతను తెలుసుకొని పోలీసుల ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడంతో అలా వెలుగులోకి వచ్చింది.
“గత ఎనిమిదేళ్లుగా దేదీప్యమానంగా ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతంటాయి. ఈ ఆలయ నిర్మాణ శైలి బాగుండటంతో భక్తులతో పాటు పర్యాటకులు తరలివస్తున్నారు. ఖమ్మం జిల్లాలోనే ప్రత్యేకమైన పేరుంది” అన్నారు మాజీ సర్పంచ్ చెన్న మోహన్.
ఖమ్మం/కూసుమంచి, విజయక్రాంతి
నా జన్మ ధన్యమైంది
కూసుమంచి సీఐగా పనిచేస్తున్న సమయంలో పెట్రోలింగ్ కోసం శివాలయం ముందు నుం చి వెళ్లా. ఆలయ పునరుద్దరణకు నా వంతు సాయం చేశా. పరమశివుడే నాతో ఆలయ పనులు చే యించాడని అనిపిస్తుంది. ఈ గుడి ఆనాటి కాకతీయుల కాలాన్ని గుర్తుచేస్తుండటంతో పర్యాటకులకు నిలయంగా మారింది.
సాధు ప్రతాప్‌రెడ్డి, మాజీ డీఎస్పీ