మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ముషీరాబాద్, డిసెంబర్ 22 : (విజయక్రాంతి): తొలి తెలంగాణ ఉద్యనాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కాకా ఆదర్శాలకు అనుగుణంగా విద్యాసంస్థలు నెలకొల్పి గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని డాక్డర్ బీఆర్ అంబేద్కర్ కళాశాలలో కాకా గడ్డం వెంకటస్వామి 10వ వర్ధంతిని పురస్కరించుకొని అల్యూమ్‌మీట్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి శంకర్‌రావు, చెన్నూరు, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు హాజరై కాకా చిత్రపటానికి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి కాకా అని కొనియాడారు.
కాకా స్థాపించిన ఈ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించి జడ్జిలుగా సేవలు అందిస్తున్న అల్యూమిని విద్యార్థులు కాకాకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాళాశాల కరస్పాండెంట్ సరోజ వివేక్, డైరెక్టర్ విష్ణుప్రియ, కల్చరల్ కోఆర్డినేటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.