calender_icon.png 22 February, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల కోసమే కాకా మనుమడు పోటీ

02-05-2024 01:07:58 AM

గడ్డం  వంశీకృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించాలి

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

మంథనిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 

మంథని, మే 1 (విజయ క్రాంతి): రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను  పెద్దపల్లి పార్లమెంట్ బరిలో ఉంచా రని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న మంచి మనసుతోనే కాకా మనుమడు టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారని స్పష్టంచేశారు. బుధవారం మంథనిలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌తో కలిసి పాల్గొన్నారు. కాక వెంకట స్వామి కుటుంబం విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నదని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు విషప్రచారాలు చేస్తు న్నారని, వెంకటస్వామి కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నదని చెప్పారు. దేవుళ్ల పేరు మీద రాజకీయాలు చేస్తున్న పార్టీల గురించి అందరికీ తెలుసన్నారు.

రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్న బీజేపీని నిలదీసినందుకే సీఎం రేవంత్‌రెడ్డిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.  ఆరు గ్యారెంటీలను అమలు చేయట్లేదని బీఆర్‌ఎస్, బీజేపీ ఆరోపణలను ఖండించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.౭ లక్షల కోట్ల అప్పు మిగిల్చిందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు రూ.42 కోట్ల విలువైన ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని స్పష్టంచేశారు. రూ.500కే సిలిండర్ కూడా ప్రతి కుటుంబానికి ఇస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని ఉద్ఘాటించారు. ఎలక్షన్ కోడ్ ముగిశాక ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామని తెలిపారు. జూన్ 6 తేదీ నుంచి ఇంటి స్థలం ఉండీ ఇల్లు లేని నిరుపేదలకు నగదు సాయం చేస్తామని స్పష్టంచేశారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. 

బీఆర్‌ఎస్ పాలనలో అప్పుల కుప్ప

గత బీఆర్‌ఎస్ పాలనలోనే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాలు కేవలం  కమిషన్ల కోసమే చేపట్టారని ధ్వజమెత్తారు.  కాంగ్రెస్ ప్రభు త్వం ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేసిందని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ పాలనలో అసలైన పేదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు  అందలేదని అన్నారు.  ఆగస్టు ౧౫ వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు.   

గర్వంగా ఉంది: బండ్ల గణేశ్

గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా లక్ష మెజారిటీతో గెలుస్తారని సినీ నిర్మాత బండ్ల గణేశ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడిని అని చెప్పుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. తనలాంటి వారికి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ రమాదేవి, నాయకులు కొత్త శ్రీనివాస్, ఒడ్నాల శ్రీనివాస్, ముసుకుల సురేందర్‌రెడ్డి, నూకుల బానయ్య, వెంకన్న, సతీష్ పాల్గొన్నారు.