01-03-2025 12:00:00 AM
కొంత కాలం గా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కోట్ల రూపా యలు వస్తాయంటూ డబ్బు ఆశ చూపి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు ఎందరో! ఈ కేటుగాళ్ల మోసాల జాబితాలో సినీతార లూ అతీతం కాదా? అంటే ఔను, వాళ్లూ ఇందులో భాగస్వాములే అని చెప్పక పరిస్థితి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ మోసాల పాపాన్ని మూటగట్టుకుంటున్నవారిలో ఇండస్ట్రీ ప్రముఖులూ ఉండటం గమనార్హం.
ముఖానికి రంగులు పూసుకొని వివిధ పాత్రల్లో నటిస్తూ సినీ అభిమానుల మెప్పు పొందుతున్న నటీనటులు ఇలాంటి మోసాల్లోనూ పాత్రధారులవుతూ చేజేతులా ప్రతిష్టను మంటగలుపుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి కేసు ఒకటి తాజాగా నమోదైంది. ఈ కేసులో స్టార్ హీరోయిన్లు తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్ పేర్లు బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీళ్లిద్దరినీ పోలీసులు విచారించబోతున్నారని సమాచారం.
పుదుచ్చేరికి చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అశోకన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులు అరెస్టు చేసిన వాళ్లలో సతీశ్ జైన్, అరవింద్‌కుమార్ ఉన్నారు. విచారణ సమయంలో కీలక విషయాలను రాబట్టారు.
పుదుచ్చేరిలోనే కాక ఆంధ్రప్రదేశ్, చెన్నై, కోయంబత్తూర్‌లోనూ క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేసినట్టు నిందితులు వెల్లడించారు. సుమారు రూ.60 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు గుర్తించారు. ఇదే విషయమై పుదుచ్చేరి సైబర్ క్రైమ్ పోలీసులు.. తమన్నా, కాజల్‌ను విచారించనున్నట్టు తెలుస్తోంది.
ఈ కేసుతో హీరోయిన్లకు సంబంధం ఏంటి?
కోయంబత్తూరు కేంద్రంగా 2022లో ఓ క్రిప్టో కరెన్సీ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీనటి తమన్నా హాజరైంది. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన క్రిప్టో సంస్థ కార్యక్రమంలో నటి కాజల్ అగర్వాల్ సైతం పాల్గొన్నది. ముంబయిలోని క్రూయిజ్ నౌకలో పెద్ద పార్టీ నిర్వహించి, కొంత మంది సెలబ్రిటీలను ఆహ్వానించారని, ఈ విలాసవంతమైన వేడుకల ద్వారా ప్రజలను ఆకర్షించి, వారు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిం చారనేది పోలీసులకు అందిన ఫిర్యాదు సారాంశం.
ఈ స్కామ్‌లో భాగస్వాములైనందువల్లే సదరు హీరోయిన్లు దీన్ని ప్రమోట్ చేశారనేది పోలీసుల అనుమానం. ఈవెంట్లో పాల్గొన్నందుకు గాను వీరికి డబ్బులు ఏ రూపంలో ఇచ్చారు? ముంబయిలో జరిగిన క్రిప్టో ఈవెంట్‌లో ఇన్వెస్టర్లను తీసుకురావడానికి తమన్నా, కాజల్ ఎందుకు ప్రయత్నించారు వివరాలను పోలీసులు విచారణలో సేకరించనున్నారు.