మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం పక్కన గల రైల్వే గేటు నవంబర్ ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 1 నుండి 7వ తేదీ వరకు గేట్ నంబర్-57 రైల్వే వంతెన నిర్మాణ పనుల కోసం మూసి వేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు రైల్వే శాఖ అధికారులకు సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా వారం రోజులపాటు రైల్వే గేట్ మూసి ఉండడంతో 16 రోజులు పట్టణ ప్రజలు మంచిర్యాల ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందనీ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే గేట్ మూత పడటంతో మంచిర్యాలకు వెళ్లేవారు అమరవాది, రాజీవ్ నగర్, హమాలీవాడ మీదుగా మంచిర్యాలకు వెళ్ళనున్నారు. ఏదేమైనప్పటికీ రైల్వే వంతెన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో పట్టణ ప్రజలకు రైల్వే గేటు కష్టాలు తీరేలా లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.