09-04-2025 01:16:04 AM
చర్ల ,ఏప్రిల్ 8 ,(విజయ క్రాంతి)బహుళ జాతి కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడానికి బ్రాహ్మనీయ హిందూ ఫాసిస్ట్ బిజెపి కగార్ పేరుతో ప్రజలపై, ప్రజా సంఘాలపై మావోయిస్టులపై దాడులు కొనసాగిస్తుందని, అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సైతం దాడులకు పూనుకొందని సిపిఐ ఎంఎల్ మావోయిస్టు వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత ఆరోపించారు.
మంగళవారం ఆమె పేరుతో మావోయిస్టులు లేకను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సక్రమంగా అమలు చేయడం లేదని, ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించి పరిష్కారాన్ని గాలికి వదిలారని ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడి ప్రాణత్యాగం చేస్తేనే రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు.
సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ పెట్టుబడుదారుల భూస్వాముల ప్రయోజనాలను నెరవేర్చడానికి ప్రభుత్వాలు రైతుల భూములను, ప్రజల భూములను ఫారెస్ట్ భూములను ఆక్రమించి అప్పజెప్పుతున్నారని ఆరోపించారు. ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రజా సంఘాలు, ప్రజలపై పోలీసులు లాఠీ చార్జీలు అక్రమ అరెస్టులు చేస్తూ నిరంకుశత పాలనను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
కగార్ ఆపరేషన్ పేరుతో చేస్తున్న దాడుల్లో అనేకమంది తమ పార్టీ నాయకత్వం, పి ఎల్ జి ఏ తో పాటు సాధారణ ప్రజలు బూటకపు ఎన్కౌంటర్లో అమరులవుతున్నారని వారిలో ఎక్కువ మంది ఆదివాసీలే అని వారు లేఖల స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కగార్ దాడి నుంచి తమని తాము రక్షించుకోవడానికి కర్రే గుట్టపై బాంబుల అమర్చమని ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశామన్నారు.
అయినప్పటికీ కొంతమంది ఆదివాసి ఆదివాసీతర ప్రజలను పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తూ డబ్బులు ఎరచూపి ఇన్ ఫార్మర్ గా మార్చుకొని షికారు పేరుతో కర్రగుట్ట పైకి పంపిస్తున్నారని లేఖలో తెలిపారు. తమ రక్షణ కోసం అమర్చిన బాంబులోపడి చనిపోతున్నారని, గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు చెప్పుతున్న మాయమాటలకు నమ్మి ఎన్ఫార్మర్గా మారవద్దని, కర్రెగుట్ట పైకి వచ్చి తమ ప్రాణాలను కోల్పోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.