గోమాతకు జాతీయ తల్లి హోదా కల్పించాలని డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): గోమాతకు జాతీయ తల్లి హోదా కల్పించాలనే డిమాండ్‌తో ‘శ్రీ దక్షిణేశ్వర్ కేదారనాథ్ టెంపుల్ ట్రస్ట్’ మేడ్చల్ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న నెక్లెస్‌రోడ్డులో ‘రన్ ఫర్ గోమాత’ మారథాన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు.
అనం తరం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో 1966 నుంచి గో సంరక్షణ కోసం అనేక ఉద్యమాలు జరుగుతున్నాయని, గత కొద్ది కాలంగా డిమాండ్ మరింత పెరిగిందని చెప్పారు. జ్యోతిష్య పీఠ్ వేదికాశ్రమ్ శంకరాచార్య స్వామి అభిముక్తేశ్వరానంద సరస్వతి, ఉత్తరాఖండ్ గౌ రుషి గోపాల్ మణి మహరాజ్ 36 రాష్ట్రాల్లో గో జెండా ఎగురవేసి ఈ ఉద్యమానికి కొత్త దిశ ఇచ్చారని..
సర్వదళీయం గో రక్షణ మండలి, అఖిల్ భారత గో సేవ ఫౌండేషన్ కూడా గోమాతకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వినతిపత్రం అందించారని గుర్తు చేశారు. హైదరాబాద్ గో యోధుడు బాలకృష్ణ గురుస్వామి కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,900 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ గోమాత సంరక్షణకు కృషి చేస్తున్నారన్నారు.
డిసెంబర్ 15న నిర్వహించే రన్ ఫర్ గోమాత మారథాన్‌లో సుమారు 2 వేల మంది గోభక్తులు పాల్గొంటారని, ఇందులో అనేక మంది ప్రముఖులు ఉంటారని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతి దావకుడి నుంచి రూ.399 తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ రన్‌లో గో భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. వివరాలకు శ్రీ దక్షిణేశ్వర్ కేదారనాథ్ టెంపుల్ ట్రస్ట్, మేడ్చల్ సర్వదళ గో రక్షణ మండలి జాతీయ అధ్యక్షుడు జయపాల్‌సింగ్ నయాల్‌ని సంప్రదించాలన్నారు.