05-04-2025 12:12:47 AM
అధ్యక్ష రేసులో లేనన్న అన్నామలై
తమిళనాట 2026లో అసెంబ్లీ ఎన్నికలు
చెన్నై: తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్ష రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ‘తమిళనాట బీజేపీ అధ్యక్షపదవి కోసం నేతలు పోటీ పడరు. మేమంతా కలిసి మా నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. అయితే నేను ఈ రేసులో లేను. పార్టీ ఉజ్వల భవిష్యత్‌ను నేను కోరుకుంటున్నా. పార్టీ ఎప్పటికీ బాగుండాలని పరితపించే వ్యక్తిని నేను. ఎటువంటి రాజకీయ ఊహాగానాలపై స్పందించను.’ అని తెలిపారు. తమిళ అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్న వేళ అన్నామలై పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం గమనార్హం. 2026 తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరి ఈ ఊహాగానాలు ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాలి.