11-04-2025 07:23:59 PM
సామాజిక అణచివేతలపై పూలే పోరాటాలు ఆదర్శం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సమాజంలో కొనసాగుతున్న వివక్షతకు, అణచివేతలకు గురవుతూ అంధకారంలో మగ్గుతున్న పీడిత కులాలకు, మహిళలకు వెలుగుదారి చూపిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావ్ పూలే అని సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సాంఘిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే 198వ జయంతిని శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నందు ఘనంగా నిర్వహించారు. తొలుత పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో అక్షరాస్యత కేవలం 11 శాతమేనని, సమాజంలో 89 శాతం మందిని చదువుకు దూరం పెట్టిన పరిస్థితిలో ప్రధానంగా దళిత, బహుజన, మహిళలకు జ్యోతిరావు పూలే వారిలో జ్ఞాన కాంతులు వెలిగించారని కొనియాడారు.
కులం పేరిట, ధర్మం పేరిట ప్రజలను అజ్ఞానంలో ఉంచేందుకు చేసిన కుట్రలను తిప్పి కొడుతూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పూలే తన జీవితాన్నే అంకితం చేశారని అన్నారు. దళిత, బహుజన, స్త్రీల చదువుకోసం 1848లోనే తన సహచరి సావిత్రి బాయ్ పూలే, ఫాతిమా షేక్ సహకారంతో భారత దేశంలో తొలి పాఠశాలను స్థాపించాడని, గ్రామాల్లో ఆర్ధిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాడని, బాల్యవివాహాల రద్దు, వితంతు స్త్రీల పునర్ వివాహం కోసం కృషి చేసి వారికి మెరుగైన జీవితం అందించారని కొనియాడారు.
స్వేచ్చా, సమానత్వం, సంక్షేమం, అందరూ ఆనందంగా బ్రతకాలన్న లక్షల్ని తన జీవితంలో భాగం చేసుకొని జీవితాన్ని సార్ధకత చేసుకున్న పూలే నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశించిన లక్షలను నెరవేర్చేందుకు కమ్యూనిస్టు కార్యకర్తలు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, కె రత్నకుమారి, భూక్యా శ్రీనివాస్, నూనావత్ గోవిందు, బత్తుల సురేష్, కత్తెర్ల రాములు, అజీజ్, కొచ్చెర్ల జోసెఫ్, కొచ్చెర్ల రాకేష్, సోమయ్య, బాజోజు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.