calender_icon.png 19 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావుఫూలే

12-04-2025 01:12:27 AM

  1. నెక్లెస్ రోడ్డులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
  2. కాంగ్రెస్‌తోనే బీసీ ముఖ్యమంత్రి సాధ్యం
  3. బీసీ బిల్లుకు బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని ఒప్పించాలి
  4. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 
  5. ఫిలింనగర్‌లో జ్యోతిరావుఫూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): దేశంలో అంటరానితనానికి వ్యతిరేకంగా, మహిళలతో పాటు అందరికీ విద్య అందాలని పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే అందరికీ స్ఫూర్తి ప్రదాత అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఇతర వక్తలు అన్నా రు.

శుక్రవారం జూబ్లీహిల్స్ ఫిలింనగర్ చౌరస్తాలో బీసీ జేఏసీ కమిటీ చైర్మన్, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఉత్సవాల కమిటీ చైర్మన్ వీ చిన్నశ్రీశైలంయాదవ్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను మహేశ్‌కుమార్ గౌడ్, జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్, కార్పొరేటర్లు వల్ధండ వెంకటేశ్, వల్లాల నవీన్‌యాదవ్, విజయారెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. అగ్రకులాల కుట్రలతో మహాత్మా ఫూలే చరిత్ర మరుగున పడిపోయిందని, ఏ సాంకేతికత లేని రోజుల్లో ఆయన తీసుకున్న చర్య లు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇస్తాయని చెప్పారు. ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ పాటిస్తోందని చెప్పారు. ఢిల్లీ యమునా నది తీరంలో మాదిరిగా నెక్లెస్‌రోడ్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని, నాలుగు ఎకరాల్లో స్మారకాన్ని ఏర్పాటు చేయబోతున్నా మని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడే 50 శాతం రిజర్వేషన్ల అంశం పక్కకు పోయిందని, తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు. తాము చేసిన కులగణనలో తేల్చిన 56 శాతం పైగా బీసీల్లో మైనార్టీలు ఉన్నారని బీజేపీ నేతలు సాకులు చెపుతున్నారన్నారు.

కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు కుంటి సాకులు చెప్పకుండా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి మోదీని ఒప్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీతోనే బీసీ ముఖ్యమంత్రి సాధ్యమని, తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. 

బీజేపీ హఠావో, రిజర్వేషన్ బచావో: జాజుల 

బీసీ రిజర్వేషన్లు సాధించడానికి బీజేపీ హఠావో, బీసీ రిజర్వేషన్ బచావో పేరిట పోరాడుతామని జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ కులగణనలో పాల్గొనలేదని, బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతుంటే తండ్రీ కొడుకులిద్దరూ అసెంబ్లీలో లేరని ఆరోపించారు. ఫూలేకు దండం పెట్టని ఏకైక నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని విమర్శించారు. ఎన్నిసార్లు కలిసి విన్నవించినా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత చూపలేదని ఆరోపించారు.

సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీని ఒప్పించి బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం కృషి చేశారని కొనియాడారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, కులగణన చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పరేడ్‌గ్రౌండ్‌లో 10లక్షల మందితో సభ నిర్వహిస్తామని తెలిపారు. మోదీ బీసీ బిడ్డ అయితే తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని, పార్లమెంట్ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసి బీసీలకు అండగా ఉండాలన్నారు.

లిక్కర్ రాణి కవిత ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దీక్షలు చేస్తోందని, బీసీల గురించి ఆమె మాట్లాడనవసరం లేదని తాము కొట్లాడుతామని ఎద్దేవా చేశారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రాంచంద్రయాదవ్ మాట్లాడుతూ దేశంలోని మొదటి తరం సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యదగిరి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, డాక్టర్ రత్నకుమార్, వెంకటేశ్‌చౌహాన్, బీసీ సంఘాల నేతలు మణిమంజరి, కుందారపు గణేష్‌చారి, విక్రమ్‌గౌడ్, శ్యాం పాల్గొన్నారు. 

బీసీ నేతలతో కార్పొరేటర్ వాగ్వాదం

విగ్రహావిష్కరణ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై జాజుల శ్రీనివాస్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ నిరసన తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సభ నుంచి వెళ్లాక బీసీ సంఘాల నేతలతో బీఆర్‌ఎస్, జాగృతి కార్యకర్తలతో ఆయన వాగ్వాదానికి దిగారు. జాజుల శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు కార్పొరేటర్‌ను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం జాజుల శ్రీనివాస్‌పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, బీఆర్‌ఎస్, జాగృతి కార్యకర్తలతో కలిసి ఫిర్యాదు చేశారు.