- ఆర్చరీ ప్రపంచకప్‌లో మూడో స్వర్ణం
అంటల్యా (టర్కీ): తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటింది. టర్కీ వేదికగా మహిళల ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో జ్యోతీ సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌తో కూడిన భారత జట్టు పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన ఫైనల్లో సురేఖ బృందం 232 ఎస్తోనియాకు చెందిన లిసెల్ జాట్మా, మారిటా పాస్, మారిస్ టెట్స్‌మన్ త్రయాన్ని చిత్తు చేసింది. ఈ ఏడాది ఇప్పటికే షాంఘై, యోచియోన్ ఆర్చరీ ప్రపంచకప్పుల్లో స్వర్ణాలు నెగ్గిన సురేఖ బృందం.. ముచ్చటగా మూడో పసిడి పతకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.
తద్వారా ఆర్చరీ ప్రపంచకప్పుల్లో ఒకే ఏడాది మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత మహిళా బృందంగా సురేఖ జోడీ నిలిచింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ ప్రియాన్ష్ రజతంతో మెరిశాడు. ఫైనల్లో ప్రియాన్ష్ 148 నెదర్లాండ్స్ ఆర్చర్ మైక్ ష్లోసెర్ చేతిలో పరాజయం చవిచూసి రెండో స్థానంలో నిలిచాడు. కాగా ఏప్రిల్‌లో షాంఘై ప్రపంచకప్‌లోనూ ప్రియాన్ష్ రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. రికర్వ్ విభాగంలో భారత్‌కు మూడు పతకాలు వచ్చే అవకాశముంది. రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లో తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, అంకిత సెమీఫైనల్లో అడుగుపెట్టారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతక పోరులో భాగంగా ధీరజ్ కౌర్ ద్వయం మెక్సికో జంటతో తలపడనుంది. ఆదివారం రికర్వ్ విభాగంలో ఫైనల్స్ జరగనున్నాయి.