calender_icon.png 18 November, 2024 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయబద్ధంగా భూములను సేకరిస్తున్నాం

18-11-2024 03:55:59 AM

ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నాయి

ప్రభుత్వాధికారులపై దాడికి ఉసిగొల్పడం సబబుకాదు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): ఫార్మాసిటీ లాంటి తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రజల నుంచి న్యాయబద్ధంగా భూములను తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజర్సింహ తెలిపారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలతో ప్రభుత్వాన్ని నిందించేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

ఆదివారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొమ్మిదిన్నండ్లుగా ఎన్ని సమస్యలు వచ్చినా పార్టీ కోసం పనిచేశామని, రాష్ట్ర సాధనకు సైతం పదవులను త్యజించినట్లు గుర్తుచేశారు.

గత ప్రభుత్వంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణంలో రైతులకు జరుగుతున్న నష్టాలపై పోరాటం చేశామన్నారు. భూసేకరణలో నష్టం జరిగితే కోర్టులకు వెళ్లాలేగానీ.. అధికారులపై దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దౌర్జన్యాలు, రౌడీయింజం చేస్తే సహించేది లేదన్నారు.

భూసేకరణలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు 2013లో భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు.

మహిళల సంక్షేమం కోసం గతంలో వైఎస్‌ఆర్ సీఎం గా ఉన్నప్పుడు పావలవడ్డీకి రుణాలు మంజూరు చేయగా, రేవంత్ రెడ్డి సర్కార్ మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తుందన్నారు. పోరాడి తీసుకొ చ్చిన ప్రభుత్వంలో తెలంగాణ బిడ్డలకు సర్కార్ కొలువులు దక్కుతున్నాయన్నారు.

సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జీ అంజయ్య, జహీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చరణ్, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ పాటిల్, ఉజ్వాల్‌రెడ్డి పాల్గొన్నారు.