05-04-2025 11:30:45 PM
అలహాబాద్ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు..
విధులకు దూరంగా ఉండనున్న జస్టిస్..
అలహాబాద్: నోట్ల కట్టల వివాదంలో చిక్కుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ శనివారం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రైవేటు ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణను ఎదుర్కొంటున్నందున అలహాబాద్ హైకోర్టులో ఎలాంటి న్యాయ విధులను అప్పగించలేదు. ప్రస్తుతం అలహాబాద్ చీఫ్ జస్టిస్ తర్వాత సీనియారిటీలో జస్టిస్ వర్మ ఆరో స్థానంలో ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసును మార్చి 28న కేంద్రం ఆమోదించింది.
బార్ అసోసియేషన్ డిమాండ్‌ను పరిశీలిస్తామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇవ్వడంతో తమ ఆందోళనను అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ విరమించింది. గత నెల 14న జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేరు. అగ్నిప్రమాదం సమయంలో స్టోర్ రూమ్‌లో పెద్ద ఎత్తున కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ నోట్ల కట్టలతో తనకు సంబంధం లేదని జస్టిస్ వర్మ పేర్కొన్నారు. విమర్శలకు దారి తీయడంతో నిజానిజాలు వెలికి తీసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నియమించారు.