calender_icon.png 12 February, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణతో న్యాయం

12-02-2025 01:43:16 AM

  1. మాదిగలు, ఉప కులాలకు మేలు చేయాలనేదే లక్ష్యం
  2. వర్గీకరణ బిల్లుకు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం
  3. తనను కలిసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  4. ఎస్సీలను నాలుగు గ్రూప్‌లుగా విభజించాలి 
  5. నివేదికలోని లోటుపాట్లను సవరించాలి 
  6. సీఎంకు మందకృష్ణ వినతి
  7. ముఖ్యమంత్రికి సోదరుడిగా అండగా ఉంటానని వెల్లడి
  8. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితోనూ భేటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : రాజకీయ ప్రయోజనాలకు అతీ తంగా మాదిగ, మాదిగ ఉప కులాలకు మేలు చేయాలని, న్యాయం జరగాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నదని సీఎం తెలిపారు.

వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు మందకృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి కమిట్‌మెంట్‌ను కృష్ణ మాదిగ అభినందించారు. వర్గీకరణ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి సోదరుడిగా అండగా ఉంటానని కృష్ణ మాదిగ ఈ సందర్భంగా అన్నారు.

వర్గీకరణలో ఉన్న కొన్ని లోటుపాట్లను సవరించాలని, గతం లో ఎస్సీలకు ఏబీసీడీలుగా ఉన్న మాదిరిగానే నాలుగు గ్రూప్‌లు కొనసాగించాలని, మూడు గ్రూప్‌లు చేయడం వల్ల అందరికి న్యాయం జరగదని సీఎంకు కృష్ణ మాదిగ విన్నవించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్గీకరణపై అసెంబ్లీలో చర్చించడం, క్యాబినెట్ సబ్‌కమిటీతో పాటు న్యాయ కమి షన్ వేశామన్నారు.

నివేదికలను వేగంగా తీసుకుని క్యాబినెట్‌లో చర్చించామని అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ఆమోదించామని తెలిపారు. దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.

సమస్యలు, అభ్యంతరాలను క్యాబినెట్ సబ్‌కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని కృష్ణ మాదిగకు సీఎం సూచించారు. సీఎం సూచనల మేరకు వర్గీకరణ మంత్రివర్గ సబ్‌కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోనూ మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వర్గీకరణ నివేదికలో ఉన్న లోటుపాట్లకు సవరణ చేయాలని వినతిపత్రం అందజేశారు. 

లోపాలను సవరించాలి: మంద కృష్ణ మాదిగ 

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందని, వర్గీకరణకు  అనుకూలంగా తీర్మానం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు  మంద కృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారని, ఇందులో సీఎం భాగస్వామి అయ్యారని, ఎన్నో సందర్భాల్లో రేవంత్‌రెడ్డి ఎమ్మార్పీఎస్‌కు అండగా ఉన్నారని కృష్ణ మాదిగ గుర్తు చేశారు.

భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదిక ను రాష్ట్ర ప్రభుత్వం జాప్యం లేకుండా ఆమోదించిందని తెలిపారు. అయితే రిజర్వేషన్ శాతం విషయంలో కొన్ని లోపాలున్నాయన్నారు. కులాల చేర్పులు, మార్పుల్లో లోటుపాట్లు ఉన్నాయని సీఎంకు వినతిపత్రం అందజేసినట్లు కృష్ణ మాదిగ చెప్పా రు.

‘ఎస్సీ కులాల్లో అత్యధికంగా 62 శాతం జనాభా ఉన్న మాదిగలకు అన్యాయం జరిగింది. ఎస్సీ జనాభాలో రెండో స్థానంలో ఉన్న మాలలకు జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్ కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ చేసినట్లుగానే ఎస్సీలను ఏబీసీడీగా వర్గీకరణ చేయా లి. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎస్సీలను మూడు గ్రూప్‌లుగానే విభజన చేసింది.

రిజర్వేషన్ల కేటాయింపు, ఏ కులాలను ఏ గ్రూప్‌లలో చేర్చాలనే విషయంలో అంశంపై శాస్త్రీయతను పాటించలేదు. గ్రూప్ ఉన్న కులాలకు వెనుకబాటుతనం ప్రాధాన్యతగా తీసుకుని  1 శాతం కేటా యించారు. ఎస్సీల్లో అతిపెద్ద  జనాభా సంఖ్య 62 శాతం ( 32,33,642) ఉండి, అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న మాదిగలకు 9 శాతమే కేటాయించారు. రెండో స్థానంలో 29 శాతం (15,27,143)  ఉన్న మాలలకు 5 శాతం కేటాయించారు.

జనాభాలో మూడో  స్థానంలో ఉన్న నేతకాని కులానికి మహర్, హోలియదాసరి వంటి మరికొన్ని కులాలను కలిపి మూడో గ్రూప్ -3గా ఏర్పాటు చేయాలి. ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో ప్రయోజనాలు పొందిన  మాల, ఇతరులను గ్రూప్-4 గా ఏర్పాటు చేయాలి. 

చేవెళ్ల డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ 15 శాతం నుంచి 18 శాతానికి రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ అమలు చేయాలి ’ అని  సీఎంను కోరినట్లు కృష్ణ మాదిగ చెప్పారు. ఎస్సీ వర్గీకరణలో ఉన్న లోటుపాట్లను సీఎం రేవంత్‌రెడ్డి సరిదిద్దుతారని భావిస్తున్నామని, అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. 

ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో జరిగిన భేటీల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, బీసీ నాయకులు పృథ్వీరాజ్ యాదవ్, సీనియర్ జర్నలిస్టు సయ్యద్ ఇస్మాయిల్, తెలంగాణ విఠల్, నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు దీపక్‌కుమార్, ప్రొఫెసర్ జాడి ముసలయ్య, ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షులు చిలుమూరి శ్రీనివాస్, హోలియదాసరి అధ్యక్షులు జహింగీర్, వెంకటేష్ తదితరులున్నారు.