ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను కమిషన్ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉపకులాల వారీగా ఎస్సీల వెనుకబాటుతనాన్ని ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేయనున్నది. 60 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అంశంపై నివేదిక సమర్పించాలని కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అయితే తక్షణమే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది.
వెంటనే ఎస్సీ వర్గీకరణపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. దీనిలో పలువురు మంత్రులు సభ్యులు. ఇటీవల మంత్రివర్గ ఉప సంఘం చర్చల్లో భాగంగా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు చెందినవారి స్థితిగతులు, ఆర్థిక అంశాలు, సామాజిక పరిస్థితిపై క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కొన్ని రోజుల్లో వ్యవధిలోనే ఏకసభ్య కమిషన్ చీఫ్ నియామకం కావడం విశేషం.