23-02-2025 12:09:33 AM
లోపాలున్నాయని మందకృష్ణ మాదిగ ఆరోపణలు సరైంది కాదు
పేరిట వర్గీకరణను కాలయాపన చేయొద్దు
రాజనర్సింహను విమర్శిస్తే సహించేది లేదు
మాదిగకు మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక నేతల హెచ్చరిక
ముషీరాబాద్,(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదిక న్యాయబద్దమైనదని, నివేదికలో లోపాలున్నాయని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపణలు చేయడం పట్ల పలు ఎమ్మార్పీఎస్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. గత 30 ఏండ్ల సుధీర్ఘ ఎన్నో ఉద్యమ పోరాటాల ఫలితంగా వచ్చిన ఎస్సీ వర్గీకరణను లోపాల పేరిట మందకృష్ణ మాదిగ మోకాలడ్డేయడం మానుకోవాలని హితవు పలికాయి. వర్గీకరణకు అడ్డుపడితే సహించేది లేదని మాదిగ సంఘాల నేతలు మందకృష్ణ మాదిగను హెచ్చరించాయి. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక, బేడ బుడగ జంగాల హక్కుల దండు వ్యవస్థాపక అధ్యక్షుడు తూర్పాటి హనుమంతు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్య వేదిక చైర్మన్ మేడి పాపయ్య మాదిగ, వైస్ చైర్మన్‌లు జన్ను కనకరాజు మాదిగ, ఇటిక రాజు మాదిగ, మేరి మాదిగ, గడ్డ యాదయ్య మాదిగ, బేడ బుడగ జంగాల హక్కుల దండు వ్యవస్థాపక అధ్యక్షుడు తూర్పాటి హనుమంతు మాట్లాడుతూ ఒక వైపు ఎస్సీ వర్గీకరణ, మరో పక్క తమ ఉద్యమ నేత మందకృష్ణకు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా మాదిగ సంఘాలు సంబురాలు చేసుకునే క్రమంలో ఎస్సీ వర్గీకరణ విషయమై జస్టిస్ షమీమ్ అక్తర్ కమిటీ ఇచ్చిన నివేదికలో లోపాలున్నాయని మందకృష్ణ మాదిగలను, మాదిగ ఉపకులాలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు.
మాదిగ కాని ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహను మంత్రి పదవి నుంచి తప్పించాలని ఆరోపణలు చేస్తున్న మందకృష్ణ మాదిగ కులాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని, తన పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని ఎస్సీ వర్గీకరణను తెలంగాణ ఉప ముఖ్య మంత్రి దామెదరం రాజనర్సింహ చొరవతో సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు బీజం వేశారని, దీన్ని ముందుకు సాగించేది పోయి కమిషన్ నివేదికలో లోపాలున్నాయని అసత్యపు ఆరోపణలు చేస్తూ మదిగల మద్య గొడవలు సృష్టించేందుకు మందకృష్ణ మాదిగ ప్రయత్నిస్తున్నారని వారు మండిపడ్డారు. బీజేపీకి సంబంధించిన వ్యక్తిని పక్కన పెట్టుకొని మనువాద రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తూ మనువాదిగా మారారని వారు ఆరోపించారు. ‘లక్ష డప్పులు వేయి గొంతుకలు’ ఎవరో ఆపారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డప్పు చెప్పు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని వారు ప్రశ్నించారు. మంత్రి దామోదరం రాజనర్సింహను విమర్శిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. మాదిగ కులాలతో చర్చించుకొని ఒక్క తాటిపైకి పోదామని, లేని పోని విమర్శలు చేసి వర్గీకరణకు అడ్డుపుల్ల వేసి కాలయాపనకు గురిచేయొద్దని వారు హితవు పలికారు. ఈ సమావేశంలో సంగీతపు రాజలింగం, పాలడుగు శ్రీనివాస్, రమణ, నర్సింహ, ఏసోబ్, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.