28-03-2025 12:34:55 AM
సంఘం అధ్యక్షుడు నీరటి ఆంజనేయులు
చేవెళ్ల, మార్చి 27:చందన వెల్లి, హైతాబాద్, సీతారాం పూరం ఇండస్ట్రియల్ పార్కు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు, సోషలిస్టుల పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరటి ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చందన వెల్లిలో నిర్వాసితుల నుంచి తీసుకున్న భూమిలో గురువారం ఓ కంపెనీ ప్రతినిధులు బోరు వేసేందుకు ప్రయత్నించగా... సంఘం సభ్యులతో కలిసి అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గత ప్రభుత్వం టీఎస్ ఐఐసీ ద్వారా పేదల నుంచి భూములు తీసుకొని పరిహారం ఇవ్వకుండానే కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పిందని మండిపడ్డారు. ఇప్పటి వరకు మెజారిటీ రైతులకు పరిహారం రాలేదని, వచ్చిన పరిహారం కూడా చాలా వరకు నాయకులు, అధికారుల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.
2023లో పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రైతులకు పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం ప్రధాన కార్యదర్శి అనంతం, ఉపాధ్యక్షులు రెడ్డయ్య, కార్యదర్శి రాంబాబు గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు.