హైదరాబాద్, జూలై 30 (విజయ క్రాంతి) : విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ విచారణ కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను నియమించింది. జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డి సారథ్యంలో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన కమిషన్ చట్ట విరుద్ధమని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించా రు.
విచారణ పూర్తి కాకముందే విద్యుత్ కమిషన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. వారి అభిప్రాయాన్ని వెల్లడించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. నిబంధనలకు విరుద్ధం గా వ్యవహరించిన జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతలోనే జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పవర్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే విద్యుత్ కొనుగోళ్ల, ఒప్పందాలపై విచారణ తిరిగి ప్రారంభం కానుంది.
లోకూర్ ప్రస్థానం..
భారతదేశ న్యాయవ్యవస్థలో గొప్ప పేరు న్న వ్యక్తి జస్టిస్ బీ లోకూర్. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 31 డిసెంబర్ 1953లో జన్మించిన జస్టిస్ లోకూర్ ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్‌లో విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. అనంతరం అలహాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ కాలేజ్‌లో చేరారు. సెయింట్ స్టిఫెన్ కాలేజ్ నుంచి హిస్టరీలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. ఫిబ్రవరి 1999లో ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ జడ్జి వృత్తి ప్రారంభించిన ఆయన కొద్దికాలంలోనే అదే కోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు.
2010లో కొంతకాలం ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా విధులు నిర్వర్తించారు. అనంతరం జూన్ 2010లో గౌహతి హైకోర్టుకు చీఫ్ జస్టిస్ బదిలీపై వెళ్లిన ఆయన నవంబర్ 2011 వరకు సేవలందించారు. ఆ తర్వాత నవంబర్ 2011 నుంచి జూన్ 2012 వరకు ఏపీ హైకోర్టులో చీఫ్ జస్టిస్‌గా సేవలందించారు. జూన్ 4, 2012 నుంచి డిసెంబర్ 30, 2018 వరకు సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసి అనంతరం పదవీ విరమణ పొందారు. చట్టాలను సమర్థవంతంగా అమలు పర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా ఆయన పేరొందారు. ఆయన అపారమైన అనుభవం తెలంగాణ పవర్ కమిషన్‌కు ఎంతోగానో ఉపయోగపడుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లోకూర్ తీరే వేరు
విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా నియామకమైన జస్టిస్ మదన్ బీ లోకూర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటారనే పేరుంది. ప్రభుత్వాలు చేసే అన్యాయాలను ఎండగడుతుంటారు. న్యాయవ్యవస్థపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని, ఇది దేశానికి మంచిది కాదని గతంలో విమర్శలు కూడా చేశారు. దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేసి ఆధారాలు సమర్పించకుండా జైల్లోనే ఉంచే ప్రయత్నాలు చేస్తున్నాయని, కోర్టులు పసిగట్టడంలేదని వ్యాఖ్యలు చేశారు.