ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నూతన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- రాష్ట్రపతి భవన్ వేదికగా కార్యక్రమం
- భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు
న్యూఢిల్లీ, నవంబర్ 11: జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం ఖన్నాతో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర మత్రులు కిరెణ్ రిజిజు, మనోహర్‌లాల్ ఖట్టర్‌తోపాటు మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ పాల్గొన్నారు. జస్టిస్ చంద్రచూడ్ ఈ నెల 10న పదవీ విరమణ పొందడంతో తదుపరి సీజేఐగా ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది మే 13 వరకు ఖన్నా సీజేఐగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఆరేళ్లలో 117 తీర్పులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2019 జనవరిలో పదోన్నతి పొందిన ఖన్నా గడిచిన ఆరేళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన మొదటగా సీజేఐ ఆర్టీఐ పరిధిలోకి వస్తారా? లేదా? అనే కేసు పై విచారణ జరిపారు. ఈ కేసులో సీజేఐ ఆర్టీఐ అభ్యర్థనలకు లోబడి ఉండొచ్చని, అయితే పారదర్శకత, గోప్యత హక్కుకు సమతుల్యత పాటించాలని పేర్కొన్నారు.
శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ విడాకుల కేసులో సుప్రీంకోర్టుకు విడాకులు ఇచ్చే అధికారం ఉందా అనే వాదనకు బదులిస్తూ ఆర్టి కల్ 142 ప్రకారం సుప్రీం విడాకులు మం జూరు చేయగలదని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల రద్దు, ఆర్టికల్ 370పై తీర్పులు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనాల్లో ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. ఈవీఎంలకు సంబంధించిన కేసులో వాటి పనితీరును సమర్థి స్తూ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ను వెలువరించింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రివాల్‌కు బెయిల్‌ను మంజూరు చేశారు.
తాత ఇంటిపై ప్రేమ పెంచుకున్న సీజేఐ
సీజేఐ సంజీవ్ ఖన్నా స్వాతంత్య్రానికి పూర్వం నిర్మించిన తన పూర్వీకుల ఇంటి కోసం గత కొన్నేళ్లుగా వెతుకున్నారు. సీజేఐగా జస్టిస్ ఖన్నా ప్రమాణం సందర్భంగా ఈ విషయాన్ని ఆయన సన్నిహి తులు మీడియాకు తెలిపారు. పంజాబ్ అమృత్‌సర్ ప్రాంతంలోని కత్రా షేర్‌సింగ్‌లో సీజేఐ తాతయ్య, ప్రముఖ న్యాయ వాది సరవ్‌దయాల్ స్వాతంత్య్రానికి పూర్వం ఒక ఇంటిని నిర్మించారట. జస్టిస్ ఖన్నాకు ఐదేళ్ల వయసులో తన తండ్రితో కలిసి సరవ్ ఇంటికి వెళ్లారట.
చిన్నతనంలోనే ఆయన ఆ ఇంటిపై ప్రేమ పెంచుకు న్నారని, అప్పటినుంచి తన తాతయ్య ఇంటిని ఖన్నా తీపి జ్ఞాపంగా మదిలో పదిలపర్చుకున్నారట. అయితే, స్వాతంత్రోద్యమంలో ఆ ఇల్లు అగ్నికి ఆహుతైం ది. తర్వాత దాన్ని సరవ్ పునర్నిర్మించి స్వాతంత్య్రానంతరం అమ్మేశారు. ఇప్పు డు అక్కడ కొత్త నిర్మాణాలు వచ్చాయి. కానీ అమృత్‌సర్ వెళ్లినప్పుడు ఆ ఇంటి కోసం ఖన్నా వెతుకుతూనే ఉంటారట.