మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థి తులపై జస్టిస్ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. తాజాగా మాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిద్ధిఖీ రాజీనామా చేశారు. సిద్ధిఖీపై నటి రేవతి సంపత్ తీవ్ర మైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. “ప్లస్ 2 పూర్తి చేసిన తర్వాత నాకో చేదు అనుభవం ఎదురైంది. అప్పుడు నా వయసు 21. ఒక సినిమా గురించి చర్చించడానికి కలవాలంటూ సిద్ధిఖీ ఫేస్‌బుక్‌లో మెస్సేజ్ చేశారు.
కూతురనే అర్థంలో పిలువటంతో భయపడకుండా ఆయన్ను సంప్రదించా. అప్పుడు ఆయన నన్ను లైంగికంగా వేధించారు. ఆ సంఘటన తర్వాత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా దృష్టిలో ఆయనో క్రిమినల్” అంటూ రేవతి శనివారం ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది. ఇది వైరల్ కావటంతో సిద్ధిఖీ అసోసియేషన్ ఆఫ్ మాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ (ఏఎంఎంఏ) జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నారు.
మరోవైపు ప్రముఖ దర్శకుడు, కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్‌పై బెంగాళీ నటి శ్రీలేఖ కూడా కీలక ఆరోపణలు చేసింది. ఆడిషన్‌కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్తుంటే.. సినిమాలో అవకాశం ఇవ్వకపోవటం వల్లే నిందలు వేస్తున్నారంటూ స్పందించారు రంజిత్. అయినప్పటికీ ఆయనపై కూడా విమర్శలు వెల్లువెత్తడంతో పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.