calender_icon.png 24 December, 2024 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనతోనే బలహీన వర్గాలకు న్యాయం

02-11-2024 01:23:14 AM

  1. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజల సమగ్ర అభివృద్ధి 
  2. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
  3. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 
  4. బోడుప్పల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులకు  శంకుస్థాపన

మేడిపల్లి, నవంబర్ 1:  కులగణనతోనే రాష్ట్రంలోని బలహీన వర్గాలకు న్యాయం చేకూరుతుందని, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సరైన వాటా దక్కుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజల సమగ్ర అభివృద్ధి సాధ్యపడు తుందని   పేర్కొన్నారు.

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మేయర్ అజయ్ యాదవ్, కలెక్టర్ గౌతమ్‌తో కలిసి శుక్రవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.7 కోట్ల వ్యయం తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించినట్టు వెల్లడించారు. బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కట్టుబడి, ఆ బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. వక్ఫ్ భూములు, ఎస్సీలకు చెందిన భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ అంశాల పట్ల న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని పరిష్కారం చేస్తామన్నారు.

మూసీ పరీవాహక ప్రాంతం లో నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్‌చార్జి తోటకూర వజ్రష్‌యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ మలిపెద్ద శరత్‌చంద్రారెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిశోర్‌గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పోగుల నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.