calender_icon.png 29 September, 2024 | 4:59 AM

పేదలకు న్యాయం దక్కట్లే

29-09-2024 02:58:06 AM

సంపన్నులకు లభించినట్టు వీరికీ న్యాయం జరగాలి

ఇలాంటి దురదృష్టకర పరిస్థితిలో మార్పు రావాలి

నల్సార్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

మహిళల రక్షణ కోసం దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉండాలని సూచన

* మహిళలపై అఘాయిత్యాల నివారణకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళాన్యాయవాదులు, న్యాయ విద్యార్థినులతో కూడిన జాతీయ స్థాయి నెట్వర్క్‌ను నల్సార్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకోవడానికి, కేసుల పరిష్కారానికి ఈ నెట్వర్క్ పనిచేయాలి. దేశమంతటికీ ఒకే నెట్వర్క్ ఏర్పాటు చేస్తే మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడం సులభమవుతుంది. 

 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మనదేశంలో పౌరులందరికీ సమానంగా న్యాయం అందడం లేదని, దురదృష్టవశాత్తు దేశంలో ధనవంతుడికి న్యాయం లభించినట్టు పేద వారికి సిద్ధించడం లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు.

సంపన్నులతో సమానంగా పేదలకు కూడా న్యాయం అందే రోజులు రావాలని ఆకాంక్షించారు. దురదృష్టకరమైన, అన్యాయమైన ఈ పరిస్థితుల్లో మార్పునకు అందరూ నడుం బిగించాలని పేర్కొన్నారు. ఇందుకు న్యాయ పట్టాలు అందుకున్న యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

శనివారం హైదరా బాద్ శామీర్‌పేట్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ప్రాథమిక హక్కులుగా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి రాజ్యాంగం పౌరులకు కల్పించిందన్నారు.

ఏ పౌరుడికి న్యాయం పొందలేని పరిస్థితులు ఉండకూడదన్నారు. న్యాయపరమైన అవకాశాలు నిరాకరించే పరిస్థితులు నివారణ జరగాలన్నారు. యువత తమ దృష్టిని అట్టడుగు వర్గాల సామాజిక న్యాయంపైన పెట్టాలన్నారు.

మహిళలతో నెట్వర్క్

మహిళలపై అఘాయిత్యాల నివారణకు దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా న్యాయవాదులు, న్యాయ విద్యార్థినులతో కూడిన జాతీయ స్థాయి నెట్వర్క్ ఏర్పాటు చేయాలని నల్సార్ యూనివర్సిటీకి రాష్ట్రపతి సూచన చేశారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలను అడ్డుకోవడానికి, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి ఈ నెట్వర్క్ పనిచేయాలని సూచించారు.

స్నాతకోత్సవానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారని, వారంతా మహిళల భద్రతను ప్రోత్సహించేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు. దేశమంతటికీ ఒకే నెట్వర్క్ ఏర్పాటు చేస్తే మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడం సులభం అవుతుందన్నారు. నల్సార్లో న్యాయ విద్య పూర్తి చేసిన యువత సామాజిక న్యాయం, అభివృద్ధిలను సాధనంగా ఎంచుకోవాలన్నారు.   

ఏఐ వల్ల ఉపయోగాలు

విశ్వంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రధానమైన అంశమని, ఏఐపై నల్సార్ దృష్టి కేంద్రీకరించడం శుభ పరిణామమని రాష్ట్రపతి అన్నారు. న్యాయపరమైన అంశాలకు ఏఐ దోహదపడుతుందని చెప్పారు. న్యాయనిపుణులు, న్యాయమూర్తులు తమ ముందున్న వివాదాలను ఏఐ ద్వారా కక్షిదారుల మూల్యాంకనం చేసేందుకు వీలవుతుం దని పేర్కొన్నారు. భవిష్యత్ న్యాయ నిపుణులుగా రాణించాలంటే పట్టాలు పొందిన విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే సత్వర ప్రయోజనాలు పొందగలరని చెప్పారు. 

చాణిక్యుడి అర్ధశాస్తంలో కోర్టులు

భారతదేశానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ప్రాచీన భారతదేశంలో ప్రజాస్వామ్య, సంప్రదాయాలు అభ్యాసాల గురించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ముగింపు ప్రసంగంలో వివరించడాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. న్యాయ నిర్వహణ ఫలితాల ప్రభావం సమాజంలోని సామాజిక, సాంస్కృతులను చాటుతాయని చెప్పారు.

సుమారు 2300 ఏళ్ల క్రితం చంద్రగుప్త మౌర్య పాలనలో చట్టాల అమలు తీరును చూసి మోసిడోనియా రాయబారి మెగస్తనీస్ ఆశ్చర్యపడ్డారని తెలిపారు. భారతీయులకు ఉన్న అసాధారణమైన చట్టాలను కీర్తించారని అన్నారు. చంద్రగుప్త పాలనలో మంత్రి చాణుక్యుడు రచించిన అర్ధ శాస్త్రం ప్రకారం ప్రతి పది గ్రామాలకు ముగ్గురు న్యాయాధికారులతో కూడిన బెంచులు ఉండేవన్నారు.

జిల్లాలు, ప్రావిన్సులలో ఉన్నత న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని అర్ధశాస్త్రం చెప్పిందన్నారు. అర్థ శాస్త్రంలో న్యాయ నిర్వహణకు బాధ్యత వహించే అధికారులకు నిర్దేశించిన ఉన్నత ప్రమాణాలను వివిస్తుందన్నారు. కేసులు పరిష్కారమయ్యే వరకు న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య వ్యక్తిగత సమావేశాల నిర్వహణకు వీల్లేదని కూడా చెప్పిందని అన్నారు.

నిష్పక్షపాతంగా న్యాయ నిర్వహణకు చాణుక్యుడు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. చారిత్రక భారతదేశ న్యాయపరమైన పునాదులు ఉన్నాయన్నారు. చట్టపరమైన కీలక సూచనలలో ఒకటైన అపస్తంబ సూత్రం ఇదే దక్కన్ పీఠభూమిలోనే లిఖితమైందన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయ సంప్రదాయాలను నేటి యువతకు వివరించేందుకే ఈ చారిత్రక విషయాలను తెలియజేస్తున్నట్టు వివరించారు.

గాంధీ తొలి సత్యగ్రహ ఉద్యమం చంపారన్ వద్ద చేసినప్పుడు న్యాయవాద ప్రతిభను చాటుకున్నారని గుర్తుచేశారు. న్యాయవాదులు తమ క్లయింట్ల ప్రయోజనాలను కాపాడాలన్నారు. చాలా మంది కార్పొరేట్ సంస్థలు, చట్టపరమైన సంస్థలలో న్యాయ సలహాదారులుగా చేరవచ్చునని, న్యాయ ప్రామాణాలను కాపాడే విధంగా న్యాయ సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

మహిళా సాధికారతకు కృషి చేయాలి

గోల్డ్ మెడల్స్ విజేతలుగా ఆడ పిల్లలే ఎక్కువగా ఉన్నారని, నల్సార్లో డిగ్రీలు పొందిన వారిలో ఆడ పిల్లలు తక్కువగా ఉన్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. మహిళా సాధికారిత సాధనకు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నల్సార్ యానిమల్ లా సెంటర్ ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. 20 ఏళ్ల క్రితం ఒడిషా ప్రభుత్వంలో మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పటి తన అనుభవాలు గుర్తుచేసుకున్నారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన స్నాతకోత్సవాన్ని నల్సార్ చాన్స్‌లర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే లాంఛనంగా ప్రారంభించారు. వైస్ చాన్సులర్ కృష్ణదేవరావు స్వాగతం పలికారు. వీరంతా విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు.