calender_icon.png 23 December, 2024 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీతో పేదరైతులకు న్యాయం

19-07-2024 12:00:00 AM

అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ సమక్షంలో రైతు రుణమాఫీని ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి దానిని అమలు పరచడం ద్వారా మాట నిలబెట్టుకున్నారు. దీంతో పేదరైతులు ఆనందంతో ఉన్నారు. వారికి న్యాయం జరిగినట్లు అయ్యింది. రాష్ట్రంలో రైతు రుణమాఫీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక దశలో ప్రభుత్వం చెయ్యలేదని కూడా మీడియాసహా సోషల్ మీడియాలోనూ ప్రతిపక్షాలు చర్చకు తెరలేపాయి. రైతుల సంఖ్య బాగా తగ్గించారనే విమర్శలు ఉన్నప్పటికీ చిన్న, సన్నకారు రైతులను విస్మరించకుండా న్యాయం చేశారనే మాట మిగిలింది.

రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేసి ఆ చర్చకు ముగింపు పలికారు. ఓట్లు వేసిన రైతులకు ఊరట కలిగించారు. అంతకు ముందు ‘రుణమాఫీతో రైతులంతా సాఫీ’ శీర్షికతో ప్రచురితమైన ఈ రచయిత వ్యాసంలో ఎవరూ రాయని విషయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ  విషయాన్ని ప్రస్తావించారు. మొత్తం మీద ఈ రచయిత గత వ్యాసంలో చేసిన సూచనలు అమలయ్యాయి.

అనుమానాలు నివృత్తి చేసిన సీఎం

అంతకు ముందు రుణమాఫీకి రేషన్ కారు,్డ పట్టాదారు పాస్‌బుక్ నిబంధన పెడుతున్నట్లు చర్చ జరిగింది. కానీ, అవేవీ లేకుండానే కేవలం పేదరికం ఆధారంగానే రుణమాఫీ జరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. పాత రుణాలు చెల్లించి తిరిగి కొత్తగా రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ లేదని మీడియాలో రావడంతో రైతులు కొంత నిరుత్సాహపడ్డ మాట వాస్తవం. కానీ, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ జరుగుతుందని, కుటుంబాన్ని గుర్తించటం కోసం మాత్రమే రేషన్ కార్డు ఉంటుందని చెప్పారు. రుణాలు చెల్లించి తిరిగి తీసుకున్న వారికి కూడా మాఫీ ఉంటుందని జీవోలో స్పష్టంగా పేర్కొనడంతో సంబంధిత రైతుల్లో అపరిమిత అనందాన్ని ఆవిష్కరించినట్లయ్యింది.

ఆ వెంటనే, ముఖ్యమంత్రి మీడియా చిట్‌చాట్‌లో జీవోలోని విషయాలను వివరించారు. దాంతో ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చింది. గతంలో చెట్లకు, పుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు రుణమాఫీ ఇవ్వటం జరిగిందని, ఇది సమంజసం కాదని ప్రజలు భావించారు. ఇన్‌కమ్ టాక్స్ కట్టేవాళ్లనుంచి కొన్ని అభ్యంతరాలూ వచ్చాయి. మూడు లక్షల రూపాయల ఆదాయం పన్ను జీరో టాక్స్ కిందకు వస్తుందని, కొంతమంది రైతులు తమ పిల్లల చదువు రుణాల కోసం టాక్స్ కడతారని, వారిని మినహాయించాలని సూచనలు వచ్చాయి. ఏది ఏమైనా పేదరికాన్ని నిబంధనగా తీసుకుని రుణమాఫీ చెయ్యటం పట్ల రైతులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

అశక్తుడుగా మారుతున్న రైతు

దేశంలో పిన్నీసు తయారుదారుడు కూడా తాను తయారుచేసే వస్తువు ధరను తానే నిర్ణయించుకొని మార్కెట్ శక్తిగా మారుతున్నాడు. కానీ, రైతు మార్కెటింగ్‌లో ఆశక్తుడుగా మిగులుతున్నాడు. ‘దేశానికి వెన్నెముక రైతు’ అంటారు. పల్లెటూళ్లే  పట్టుగొమ్మలు కావాలంటే పరిపూర్ణంగా రైతులు ఎదిగేలా, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఉండాలి. అందుకోసం విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలు ఇవ్వాలి. నూతన పోకడలు అలవర్చుకోవడం, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రియ సాగు వంటివాటి కోసం ప్రభుత్వాలు రాయితీలను ఇచ్చి ప్రోత్సహించాలి.

నేడు కూలీల రేట్లు పెరగడంతో గిట్టుబాటు ధర రాక రైతులు సతమతమవుతున్నారు. నిత్యం కష్టనష్టాలకు గురవుతూ వ్యవసాయాన్ని అతిభారంగా సాగిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ రైతు భారతం రుణగ్రస్థమై కునారిల్లుతున్నది. ఈ దురవస్థ నుంచి రైతన్నలు బయటపడవలసి ఉంది. అందుకే, రైతు ప్రోత్సాహక విధానాలను అమలు చేసే మేలైన ప్రభుత్వాలు రావాలని కోరుకుందాం. ఏది ఏమైనా 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం ద్వారా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంతరెడ్డి. భవిష్యత్తులో కూడా రైతు అనుకూల విధాన నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవాలని కోరుకుందాం.

 సాదం వెంకట్, 

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్

సెల్: 9395315326