16-02-2025 12:42:43 AM
* నా వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారు. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని నేనంటే.. కిషన్‌రెడ్డి కూడా అదే చెప్పారు.. కాకపోతే మోదీ ఎప్పుడు బీసీగా మారారు అన్న తేదీ, సమయం విషయంలో మాత్రం తేడా ఉండొచ్చు. కిషన్‌రెడ్డి చెప్పిన తేదీనే నేను అంగీకరిస్తున్నా.
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీని తాను వ్యక్తిగతంగా తిట్టలేదని, కించపర్చలేదని, హో దాను తగ్గించి మాట్లాడలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే అన్నానని ఆయ న తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై చర్చించ లేదన్నారు.
కులగణన, వర్గీకరణ అంశాలపై మాత్రమే చర్చించినట్లు తెలిపారు. కులగణన అమలుకు కమిటీ లేదా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఆ కమిటీ లేదా కమిషన్ ఇచ్చే నివేదికను ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి చట్టరూపంలోకి తెస్తామని సీఎం చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో న్యాయస్థానం సూచనల మేరకే నడుచు కుంటామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు.
ఢిల్లీలోని టెన్ జన్‌పథ్‌లో కాం గ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అనంతరం సీఎం ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. మోదీ పుట్టుకతో బీసీ కాదు కాబట్టే ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నట్లు సీఎం వివరించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు
తాను చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రు లు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని తెలిపారు. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని తానంటే.. కిషన్‌రెడ్డి కూడా అదే చెప్పారని, కాకపో తే మోదీ ఎప్పుడు బీసీగా మారా రు అన్న తేదీ, సమయం విషయం లో మాత్రం తేడా ఉండొచ్చు అని అన్నారు. ఈ విషయంలో కిషన్‌రెడ్డి చెప్పిన తేదీనే తాను అంగీకరి స్తున్నానని సీఎం పేర్కొన్నారు.
క్యా బినెట్ నిర్ణయం తన ఒక్కడి నిర్ణ యం కాదని, ఎవరేమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా తాను పట్టించుకోనని సీఎం పేర్కొన్నారు. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై కొందరు పైశాచిక ఆనందం కోసం ఉహాగానాలు వ్యాప్తి చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రం కులగణన చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి రోడ్ మ్యాప్ అని సీఎం పేర్కొన్నారు.
రాహుల్‌గాంధీతో వ్యక్తిగతంగా తనకు గ్యాప్ ఉందని వస్తున్న వార్తలను సీఎం ఖండించారు. రాహుల్‌గాంధీ గైడెన్స్‌తోనే తాను పనిచేస్తున్నానని, ముఖ్యమంత్రిగా రాహుల్ అజెండాను నెరవేర్చడమే తన పని అన్నారు. రాహుల్‌గాంధీ చెప్పిన మేరకే కులగణన సహా అన్నీ చేస్తున్నామని సీఎం వివరించారు.
‘కులగణనలో ఒక్క తప్పు ఉన్నా చూపించండి. జనం స్వయంగా చెప్పిన వివరాలే రికార్డుల్లో నమోదయ్యాయి. ఒక్కొక్క ఎన్యుమరేటర్‌కి 150 ఇళ్లు కేటాయించాం. కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలు మాత్రమే చూపారు. అందులో బీసీలు 51 శాతం, ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతం, మిగతావాళ్లు ఓసీలుగా చూపారు.
మా ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మొత్తం 5 కేటగిరీలుగా విభజించి ముస్లింలలో ఉన్న బీసీలను కూడా కలిపి చెప్పాం. ఆ ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి మొత్తం 56 శాతం అయ్యారు. 42 శాతం బీసీ రిజర్వేష్లపై అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం.
రాజకీయ జోక్యానికి తావులేకుండానే కమిషన్ ద్వారానే ప్రాసెస్ చేస్తున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఇక కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్రకుటుంబ సర్వేలో ఎస్సీలను 82 కులాలుగా చూపారని, కానీ అందులో ఉన్నవి 59 కులాలు మాత్రమేనని తెలిపారు. స్పెల్లింగ్ తప్పుగా ఎంట్రీ అయినా, దాన్ని మరో కులంగా చూపారని సీఎం చెప్పారు.
ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా తాను పట్టించుకోనని అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేసిన తర్వాత బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై కమిషన్ ఆధ్యయనం చేస్తోందన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదని సీఎం తెలి పారు. కులగణన ద్వారా ప్రజల సంక్షేమానికి బాటలు వేస్తామని అన్నారు.
తలసాని, సబిత ఎలా మంత్రులయ్యారు?
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికలు వస్తా యో, రావో అనేది కేటీఆరే చెప్పేస్తే ఎలా అని అన్నారు. రాజ్యాంగంలో ఉన్నదే కోర్టు లు అనుసరిస్తాయన్నారు. గతంలో సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ బీఫాం మీద గెలిచారు.. ఎవరి మం త్రివర్గంలో పనిచేశారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నిం చారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014లో ఏ పార్టీ బీఫామ్ మీద గెలిచారు..? ఏ ప్రభుత్వంలో పనిచేశారనేది అందరికి తెలుసన్నా రు. ‘నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నన్ను కొందరు అంగీకరించకపోవ చ్చు. కానీ నా పని నేను చేస్తున్నాను. నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను’ అని సీఎం తెలిపారు. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది తానేనని, వాటిని అమలు చేయకపోతే ప్రజలు అడిగేది తననేనని అని పేర్కొన్నారు.
బహిరంగ సభలకు రండి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలోని టెన్‌జన్‌పథ్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి దాదాపు 45 నిమిషాల పాటు రాహుల్‌గాంధీతో సమావేశమై.. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనపరమైన అంశాలపై వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాలకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన అంశాలపై రాహుల్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సూర్యాపేట, గజ్వేల్‌లో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నామని, ఈ సభలకు రావాలని రాహుల్‌గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఇక కులగణన సర్వే ఆధారంగా రాష్ట్రంలోనీ బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వడంపై రాహుల్‌కు రేవంత్‌రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు తదితర అంశాలపైన చర్చ జరిగినట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వస్తోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి కార్యాచరణ అమలు కావడం లేదు. ఇప్పుడు కూడా త్వరలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున అప్పటివరకు మంత్రివర్గ విస్తరణ ఉండకపో వచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్నికలు పూర్తయ్యాక.. వారిలోనుంచి అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని క్యాబినెట్ విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో ముస్లిం మైనార్టీ వర్గం నుంచి ఒక్కరు కూడా లేరు. ఎమ్మెల్యే కోటాలో ముస్లిం సామాజికవర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. కాగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని శనివారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.