24-01-2025 12:00:00 AM
ఆరోగ్యం అంటే శరీరం, మనసుల నడుమ సమతుల్యతను కలిగి ఉండడం. ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా మనం దీర్ఘాయువును పొందవచ్చు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోల్చినప్పుడు ఆరోగ్యరంగంలో ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విషయంలో మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలను కూడా చేరుకోలేదు. ‘అందరికీ ఆరోగ్యం’ లక్ష్యం ఇంకా సుదూర స్వప్నంగానే వుంది.
ఫార్మా, వ్యాక్సిన్‌ల రంగంలో చాలావరకు ముందంజ వేసినప్పటికీ పూర్తిస్థాయి ఆరోగ్య సేవలు అందించలేక పోతున్నాం. కాగా, మరోవైపు ఒక అధ్యయనం ప్రకారమైతే, భారతదేశం మానసిక ఆరోగ్య రుగ్మతల గణనీయమైన భారాన్ని ఎదుర్కొంటున్నది. దేశవ్యాప్తంగా లక్షలాదిమందిపై ఇది ప్రభావం చూపుతున్నది. కళంకం, అవగాహన లేకపోవడం, వివక్ష, పరిమిత మౌలిక సదుపాయాలు వంటి అంశాలు భారతీయ జనాభాలో మానసిక అనారోగ్యం భారీ భారానికి దోహదం చేస్తున్నాయి.
‘జాతీయ మానసిక ఆరోగ్య సర్వే’ (2015 ప్రకారం దాదాపు 15 కోట్ల భారతీయులకు మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలు అవసరం కాగా, 3 కోట్ల కంటే తక్కువమంది సంరక్షణను కోరుతున్నారు. భారతదేశ జనాభాలో 10.6% మంది మానసిక ఆరోగ్య పరిస్థితులతో జీవిస్తున్నారు.
అయినప్పటికీ మానసిక ఆరోగ్య సంరక్షణ అవసరమైన వారిలో 76 నుంచి -85 శాతం మంది ఎటువంటి సేవలు లేదా మద్దతునూ పొందడం లేదు. ఇటీవలి సంవత్సరాలలో, డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్స్, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా, మాదకద్రవ్యాల వినియోగం వంటి రుగ్మతలు గణనీయ ప్రభావాన్ని చూపుతుండడంతో ‘మానసిక ఆరోగ్య రుగ్మత’ల పెరుగుదలను భారతదేశం తీవ్రస్థాయిలో చవిచూస్తున్నది.
నిధులు అంతంత మ్రాతమే!
జాతీయ మానసిక ఆరోగ్య విధానం 2014, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017లో చికిత్స అంతరాన్ని పరిష్కరించడానికి మానసిక ఆరోగ్యానికి నిధులను పెంచడానికి నిబంధనలు ఉన్నప్పటికీ, ఇది తక్కువ పాలనాపరమైన ప్రాధాన్యతాంశంగానే మిగిలిపోయిం ది. ఆరోగ్యం కోసం దేశం మొత్తం బడ్జెట్‌లో 1% కంటే తక్కువ నిధులనే మానసిక ఆరోగ్యానికి కేటాయిస్తున్నారు.
మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణకు భారతదేశం బలమైన విధానం, శాసన ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉన్నప్పటికీ, దాని అమలు పట్ల ఆసక్తి కొరవడుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆసుపత్రుల సగటు సంఖ్య 100,000కి 0.04 అయితే, భారతదేశంలో 0.004 మాత్రమే. మానసిక ఆరోగ్యం పట్ల ప్రజలలో అవగాహన పెరుగుతున్నప్పటికీ వనరుల లభ్యత కొరతగా ఉంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఇదొక పెద్ద సవాలుగా మిగిలిపోయింది.
ఒక వ్యక్తి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదు. శరీర కార్యాచరణ వివిధ అవయవాల మధ్య పరస్పరం అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది. అవయవాలు సక్రమం గా పనిచేయాలంటే వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యవంతమైన వ్యక్తి సమాజానికి, దేశానికి సేవ చేస్తాడు. మానసికంగానూ దృఢంగా ఉన్నప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి ఎలాంటి వ్యాధి బారిన పడనప్పుడు మాత్రమే అతడు ఆరోగ్యంగా పరిగణించబడతారు.
ఈ ప్రస్థానం వారికి మెరుగైన సేవలందించేందుకు సహాయపడుతుంది. ఒకవైపు వైద్యఖర్చులూ పెరుగుతు న్నాయి. కనుక, ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసి ఉంది. మం చి ఆరోగ్యాన్ని కలిగి ఉంటే మనం ఆస్పత్రిలో చేరే అవకాశాలూ తగ్గుతాయి. కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి, మార్పులను అనుసరించడం ద్వారా మనం మన ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పర్చుకోవచ్చు.
మంచి పోషకాహారం, మానసిక ప్రశాంతత, పరిశుభ్రమైన గాలి, శుభ్రమైన మంచినీరు, సరైన నిద్ర తప్పనిసరి. మద్యం, మత్తు పదార్థాలకు దూరం ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శారీరక స్వస్థత, ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా వుండగలిగితే, మానసిక అనారోగ్యాన్ని నిలుపుకున్న వాళ్లమవుతాం. ఫలితంగా ఇతరత్రా శారీరక జబ్బులనూ సులువుగా నియంత్రించుకోవచ్చు.
డా. బి.కేశవులు