29-03-2025 01:55:17 AM
రేపు సన్నబియ్యం పథకం ప్రారంభం
హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌షాపుల ద్వారా పంపిణీ
త్వరలోనే పప్పు, ఉప్పు, చింతపండు తదితర నిత్యావసరాలు
కొత్తగా 30లక్షల రేషన్ కార్డులు అందించనున్నాం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): ఉగాది పండుగ రోజున రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈనెల 30 తేదీన రేషన్‌షాపుల ద్వారా దారిద్రరేఖకు దిగువనున్న వారికి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రా రంభించనున్నారని వెల్లడించారు.
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీపీఎల్ కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ జరుగు తుందని మంత్రి తెలిపారు. సన్నబియ్యంతోపాటు ఉప్పు, పప్పు, చింతపండు లాంటి నిత్యావసర సరుకులను కూడా త్వరలోనే అందజేస్తామన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మీడి యాతో మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పా టు నాటికి 89 లక్షల 73 వేల 708 రేషన్‌కార్డులు ఉంటే.. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేవలం 49,479 కార్డులు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు.
ప్రస్తు తం 90 లక్షల రేషన్‌కార్డులకు గాను 2.85 కోట్ల లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. కొత్తగా 30 లక్షల రేషన్‌కార్డులు పంపిణీచేయబోతున్నామని, దీంతో మొత్తం రాష్ట్రం లో 3.10 కోట్ల మంది వరకు లబ్ధిదారులు ఉంటారని తెలిపారు. రేషన్‌బియ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడాదికి రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఇందులో రాష్ట్రం వాటా రూ.5,175 కోట్లు, కేంద్రం వాటా రూ.5,485.5 కోట్లు అని మంత్రి పేర్కొన్నారు.
ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,858 కోట్ల భారం పడుతుం దని, పేదల కడుపు నింపేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రేషన్‌కార్డుపై ప్రధాని ఫొటోపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కొత్త రేషన్‌కార్డులో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని చిప్ ఉండదన్నారు.
రేషన్‌కార్డులు రెండు రకాలు ఉంటాయని, బీపీఎల్ కార్డులు మూడు రంగులు, ఏపీఎల్ గ్రీన్‌కలర్‌తో ఉంటుందన్నారు. సన్నరకం బియ్యం పంపిణీతో ప్రభుత్వంపై పడే భారా న్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సంబంధిత శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషిని సీఎం రేవంత్‌రెడ్డి, తాను విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ..
అర్హులైన వారికి ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంతమందికి రేషన్‌కార్డులు కావాలన్నా..అర్హతను బట్టి ఇస్తామన్నారు. రేషన్‌కార్డు ఉన్నాలేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరుంటే సన్నబియ్యం ఏప్రిల్ 1వతేదీ నుంచి ఇస్తామ న్నారు. లబ్ధిదారులు సొంతగ్రామంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.
దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదని, ఒక తెలంగాణలోనే ఉండటం గర్వకారణమన్నారు. సోనియాగాంధీ ఆకాంక్షల మేరకు యూపీఏ ప్రభుత్వం ఆహారభద్రతచట్టం తీసుకొచ్చిందన్నారు. సన్నబియ్యం రేషన్‌షాపుల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందజేస్తామని, దొడ్డుబియ్యం ఎఫ్‌సీఐకి ఇస్తామ న్నారు.
సన్నధాన్యానికి రూ.500బోనస్ ఇవ్వడంతో రైతులు ఎక్కువగా ఉత్పత్తి చేశారని, 2024 రికార్డుస్థాయిలో 24 లక్షల సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. కాగా, గతంలో సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన వారిపై పీడీయాక్ట్ కింద కేసులు పెట్టి ఉక్కుపాదం మోపామని, అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.