‘మోడలింగ్ చేసే రోజులు ఎంతో కష్టంగా గడిచాయి. కానీ ఎన్నో పాఠాలు నేర్పాయి’ అంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంది బాలీవుడ్ భామ కృతి సనన్. ‘మిమీ’తో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ సినిమా రంగంలో పదేళ్ల కెరీర్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. త్వరలో ‘దో పత్తీ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది కృతి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఇంజినీరింగ్ సెకెండ్ ఇయర్‌లోనే నాకు మోడలింగ్‌పై ఇష్టం ఏర్పడింది. నేను మొదటిసారి ర్యాంప్ వాక్ చేసిన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ షోలో బాగా ఎత్తయిన చెప్పులు వేసుకొని నడవటం అదే తొలిసారి.
అందరి ముందూ నడవటానికి భయపడి ఏడవటం ప్రారంభించా. కానీ ఆ రోజులు నాకు చాలా పాఠాలు నేర్పాయి. అయితే, మోడలింగ్ రంగంలో ప్రవేశించిన కొన్ని రోజులకే టీవీ యాడ్స్ చేశా. కెమెరా ముందు నిల్చున్నపుడు కలిగే ఆనందాన్ని అప్పుడే ఆస్వాదించా. అప్పుడే సినిమాల్లోకి ఎందుకు వెళ్లకూడదనిపించింది! నేను చేసే యాడ్స్‌కు డైరెక్షన్ చేసే దర్శకులు కూడా ‘నీకు నటనలో సహజమైన ప్రతిభ ఉంది.. సినిమా రంగం వైపు వెళ్లు..’ అని ప్రోత్సహించారు. అలా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన నేను నా పాత్రకు న్యాయం చేసేలా శ్రమిస్తా’ అని చెప్పింది కృతి సనన్.