ఏసీబీకి పట్టుబడిన షాకీర్
నిర్మల్, నవంబర్ 13 : నిర్మల్ మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ షేక్ షాకీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టణంలోని బుధవార్‌పేట్‌కు చెందిన చందుల భరత్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన సర్వీస్‌ను మున్సిపాలిటీ రికార్డుల్లో ఎక్కించాలని షాకీర్‌ను కోరాడు. అందుకు రూ.20వేలు ఇవ్వాలని షాకీర్ డిమాండ్ చేశాడు.
రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న భరత్.. ఆ తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఏస్పీ రమణమూర్తి సూచన మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో షాకీర్ కు రూ.10వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. షాకీర్‌ను అదుపు లోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదే మున్సిపాలిటీలో మూడు నెలల క్రితం రెవెన్యూ ఇన్ స్పెక్టర్, మరో అధికారి ఏసీబీకి పట్టుబడిన ఘటన మరువక ముందే మరొక్కరు పట్టుడ్డారు.