calender_icon.png 24 December, 2024 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూన్ 25..సంవిధాన్ హత్యా దినం

13-07-2024 12:19:53 AM

ఎమర్జెనీ విధించిన రోజుపై కేంద్రం కీలక నిర్ణయం

ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆదేశం

జూన్ 4న మోదీ ముక్తి దివస్: కాంగ్రెస్

న్యూఢిల్లీ, జూలై 12: కేంద్ర ప్రభుత్వం మరో రాజకీయ అగ్గికి ఆజ్యం పోసే నిర్ణయం తీసుకొన్నది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా శుక్రవారం ప్రకటించింది. 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. దాదాపు రెండేండ్లపాటు దేశంలోని రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలందరినీ జైళ్లలో పెట్టి పోలీస్ రాజ్యం నడిపించారు.

అప్పటి నుంచి కాంగ్రెస్‌ను విమర్శించాలంటే వైరి పక్షాలు ఎమర్జెన్సీనే ప్రధానంగా ప్రస్తావిస్తుంటాయి. జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్‌గా నిర్ణయించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిరంకుశంగా దేశంపై అత్యవసర పరిస్థితిని విధించి దేశ ప్రజాస్వామ్య ఆత్మ గొంతు కోశారు. ఏ తప్పూ చేయని లక్షల మంది అమాయకులను కటకటాల వెనక్కు నెట్టారు. మీడియా నోరు నొక్కారు’ అని అమిత్ షా విమర్శించారు. 

మోదీ ముక్తి దివస్: కాంగ్రెస్

మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేశ్ విమర్శించారు. జూన్ 4న మోదీ ముక్త్ దివస్‌గా నిర్వహిస్తామని ప్రకటించారు. ‘2024 జూన్ 4న ఈ దేశ ప్రజలు వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా ఓడించే వరకు పదేండ్లపాటు దేశంలో అనధికార ఎమర్జెన్సీ విధించిన నాన్ బయోలాజికల్ పీఎం మళ్లీ మీడియాలో హెడ్‌లైన్ల కోసం మరో కపట నాటకానికి తెరతీశారు’ అని ట్వీట్ చేశారు.

భారత రాజ్యాంగం మనుస్మృతికి తగినట్టుగా లేదన్న కారణంతో బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ దానిని గుర్తించటానికే నిరాకరించిందని గుర్తుచేశారు. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి నిర్ణయాలు తీసుకొన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఆరోపించారు. 1975 నాటి కాంగ్రెస్ ఎమర్జెన్సీని ప్రస్తావించాలంటే.. నేడు బీజేపీ విధించిన ఎమర్జెన్సీని కూడా ప్రస్తావించాల్సిందేనని సమాజ్‌వాదీ పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ అన్నారు.