calender_icon.png 15 January, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జుంబారే.. జుజుంబారే

12-09-2024 12:00:00 AM

రొటీన్ లైఫ్‌లో చాలామంది కొత్తదనం కోరుకుంటున్నారు. ఓ లక్ష్యంతో ఫిట్‌నెస్ కోసం గంటలకొద్దీ శ్రమపడకుండా నచ్చిన మ్యూజిక్ వింటూ.. అందుకు తగ్గట్టుగా స్టెప్పులు వేస్తే ఆ మజాయే వేరు. అందుకే ఈ జనరేషన్ లేడీస్ ‘జుంబారే.. జుజుంబారే’ అంటూ.. డాన్సులు వేస్తూ మెరుపు తీగల్లా మెరిసిపోతున్నారు. హెల్త్‌కు హెల్త్.. ఫన్‌కు ఫన్ ఉండటంతో జుంబాపై మనసు పారేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జుంబాతో మహిళలకు లాభాలేంటో ఒకసారి లుక్కేద్దాం మరి.

రన్నింగ్, జాగింగ్, వాకింగ్ ఏదైనా సరే.. మొదట్లో కాస్త కష్టంగా ఉంటుంది. అలవాటు కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఏదో ఒకరోజు స్కిప్ చేస్తే మరుసటి రోజు ముసుగు తన్నేసి పడుకుంటాం. అయితే.. వ్యాయామం వ్యాయామంలా కాకుండా ఇష్టంగా.. ఓ హాబీలా చేస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. అందుకే మహిళలకు జుంబా బెస్ట్ ఛాయిస్‌గా మారింది. యోగా, ఇతర ఫిట్‌నెస్  లాంటివాటికి బదులు జుంబాను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. నచ్చిన పాటలు వింటూ.. అందుకు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ ఈజీగా బరువు తగ్గడమే ఇందుకు మెయిన్ రీజన్. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో మహిళల కోసం ప్రత్యేకంగా జుంబా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి.

ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలామంది మహిళలు ఉద్యోగాలకు, కుటుంబాలకు పరిమితమవుతున్నారు. దాంతో హెల్త్ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ‘ఉద్యోగం ఎంతో ముఖ్యమో.. ఫిట్ నెస్ అంతకంటే ముఖ్యం’ అని అంటున్నారు జుంబా ట్రైనర్స్. ఇదే విషయమై అశ్వినీ వారణాసి అనే జుంబా ట్రైనర్ మాట్లాడుతూ.. “జుంబాతో చాలా ఉపయోగాలున్నాయి. రన్నింగ్, జాగింగ్ చేయాలంటే కిలోమీటర్ల కొద్ది పరుగులు తీయాల్సి ఉంటుంది. కానీ జుంబాతో మనసుకు నచ్చిన పాటలు వింటూ, డాన్సులు చేస్తూ ఈజీగా బరువు తగ్గొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా జుంబా చేయొచ్చు. కానీ, మహిళలకు హెల్త్ బెన్‌ఫిట్స్ ఎక్కువ. హార్మోన్స్‌తో ఇబ్బందులు పడేమహిళలకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది.” అని చెప్తుందామె. 

డ్యాన్స్ విత్ వర్కవుట్స్ 

ఏరోబిక్స్‌ను పోలి ఉండే జుంబా నృత్యంలో బాడీ వర్కవుట్స్ ఎక్కువగా ఉంటాయి. కార్డియో బేస్డ్ వర్కవుట్లతో కూడిన నృత్యాన్ని ప్రాక్టీస్ చేస్తే శరీరంలో ఫ్యాట్ తగ్గుతుంది. ఈ డ్యాన్సులో కొన్ని స్టెప్పులలో జంపింగ్, స్క్వాటింగ్, కిక్స్ సైతం ఉంటాయని జుంబా డ్యాన్స్ ట్రైనర్స్ చెప్తున్నారు. రోజుకు కనీసం ఒక గంట జుంబా చేస్తే ఎక్కువస్థాయిలో కేలరీలు కరిగిపోతుందని అంటున్నారు. జుంబా డాన్స్‌తో చెమట రావడం మూలంగా బాడీ హైడ్రేటెడ్ కాకుండా ఉంటుంది. మెటబాలిక్ రేటు కూడా పెరుగుతుంది. బాడీ షేప్ పూర్తిగా ఫిట్‌గా ఉంటుంది. సాగిన చర్మంను టైట్‌గా మార్చుతుంది. ఇన్నీ ప్రయోజనాలున్నాయి కాబట్టే మహిళలు జుంబా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇల్లు, ఉద్యోగంతో పాటు జుంబా కూడా తమ జీవితంలో భాగమైపోయిందంటున్నారు కొత్తగా నేర్చుకుంటున్న మహిళలు. 

ప్రతిరోజు కొత్తగా..

ఇతర వ్యాయామాలతో పోలిస్తే జుంబా చాలా ప్రత్యేకం. జుంబాను రెగ్యులర్ చేస్తే తర్వగా వెయిట్ లాస్ కావొచ్చు. రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. కొంతమంది మహిళలు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. జుంబాతో వాటికి చెక్ పెట్టొచ్చు. 40 ఏళ్ల వయసులో కూడా 20లా కనిపించవచ్చు. ఇతర వర్కవుట్స్ చేస్తే కొద్దిరోజులకే బోర్ కొడుతోంది. అదే జుంబాతో రోజుకో పాట పెట్టుకొని.. అందుకు తగ్గట్టుగా డాన్సులు చేస్తూ హెల్దీగా ఉండొచ్చు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ పాటలకు తగ్గట్టుగా డాన్సులు చేయడం వల్ల జుంబా బోర్ కొట్టదు. లాటిన్స్ డాన్స్ తో (మెరింగే, సాల్సా, కుంబియా, బెల్లీ డాన్స్, ఫ్లామింకో, ట్యాంగో) బాడీకి మొత్తం వ్యాయామం అందుతుంది. దీంతో రోజంతా హుషారుగా ఉండొచ్చు. 

హెల్త్  బెనిఫిట్స్ ఇవే

  1. మహిళల్లో పీసీవోడి కంట్రోల్ 

ఒత్తిడి దూరం

గుడ్ మెంటల్ ఎబిలిటీ 

త్వరగా బరువు తగ్గడం

రోగ నిరోధశక పెరుగుతుంది

ఫిజికల్ హెల్త్ బాగుంటుంది

 చేతన్

డాన్స్‌తో ఫిట్‌నెస్

నాకు చిన్నప్పట్నుంచి ఫిట్‌నెస్ చాలా ఇష్టం. మొదట్లో జిమ్‌కు వెళ్లేదాన్ని. గంటల తరబడి వర్కవుట్స్ చేసేదాన్ని. బరువు అయితే తగ్గాను. కానీ ఏదో అసంతృప్తి. కొత్తగా ఏదైనా చేయాలనిపించి జుంబాలో జాయిన్ అయ్యా. మనసుకు నచ్చిన పాటలు వింటూ వర్కవుట్స్ చేస్తే ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది. జుంబాతో ఆనందంగా ఉండొచ్చు. ఆరోగ్యంగానూ ఉండొచ్చు. అందుకే ఎనిమిది సంవత్సరాలుగా జుంబా చేస్తున్నా. ప్రస్తుతం ట్రైనర్‌గా మారి నాలాంటివాళ్లకు క్లాసులు తీసుకుంటున్నా. ఫుడ్, జాబ్ ఎంత అవసరమో.. ఎక్సర్‌సైజు కూడా అంతే అవసరం. ప్రతిఒక్కరూ జీవితంలో ఒకసారైనా జుంబాను ట్రై చేయండి.

- అశ్వినీ వారణాసి, చందానగర్

రోజంతా చురుగ్గా

నేను మొదట్లో చాలా బరువు ఉండేదాన్ని. ఫిట్‌నెస్ కోసం జుంబాలో జాయిన్ అయ్యా ను. ఒకసారి చేయగానే మంచి రిలాక్స్ అనిపించింది. అందుకే కంటిన్యూ చేస్తున్నా. హార్మోన్ సమస్య కూడా తగ్గింది. 15 కేజీల బరువు తగ్గాను. ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా పనిచేయొచ్చు. లైఫ్‌స్టైల్ మారింది. ప్రతిరోజు అరగంట చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. జుంబాలో చాలా డాన్సులు కవర్ చేయడం వల్ల బాడీకి మొత్తం వ్యాయామం అందుతుంది.

నవ్య కనగాల, చందానగర్

త్వరగా వెయిట్‌లాస్ అవ్వొచ్చు

ప్రస్తుత బిజీలైఫ్‌లో చాలామంది వేళ్లకు పనిచెబుతూ కంప్యూటర్లతో కుస్తీలు పడుతున్నారు. జాబ్ ఒత్తిడిలో పడిపోయి పూర్తిగా బాడీని మరిచిపోతున్నారు. ఒకప్పుడు మన తాతలు కష్టం చేశారు కాబట్టే ఆరోగ్యంగా ఉండగలిగారు. ఈ కానీ జనరేషన్ వాళ్లు నాలుగు గోడలకే పరిమితమై వ్యాయామం మరిచిపోతున్నారు. జుంబా చేస్తే బాడీ, మైండ్ రెండు రిలాక్స్ అవుతాయి. ప్రతిరోజు కాలరీలు బర్న్ అవుతాయి. అందుకే చాలామంది ఇతర వ్యాయామాల కంటే డ్యాన్స్ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మహిళలతో పాటు మగవాళ్లు కూడా జుంబా చేయొచ్చు.

 రాఘవేంద్ర, డ్యాన్స్ మ్యూజిక్ ఫిట్‌నెస్ స్టూడియో