07-04-2025 11:34:56 PM
లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు...
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని సిర్పూర్ గ్రామంలో సోమవారం సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. సన్న బియ్యంతో వండిన భోజనం ఎలా ఉందని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలు వస్తున్నాయా అంటూ ఆరా తీశారు. ప్రజా ప్రభుత్వం పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం ఇచ్చి వారి కడుపు నింపుతుందని ఎమ్మెల్యే అన్నారు.
సంపన్నులు తినే సన్న బియ్యాన్ని సామాన్యులకు ఉచితంగా పంపిణీ చేయడంతో ఊరూరా సంబురాలు చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే వాటిని తినడానికి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదని తెలిపారు. పథకం పక్క దారి పట్టి దళారులు, మిల్లర్లు లబ్ది పొందేవారని వివరించారు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసమే పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి జుక్కల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.