calender_icon.png 29 January, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండితెరపై మెరిసిన జూకా!

18-11-2024 12:00:00 AM

ఆమె ఒక ట్రెండ్ సెట్టర్, మనోహరమైన సౌందర్యం, నిండైన నవ్వు, అందంతో ఫ్యాషన్ ప్రియుల హృదయాలను దోచుకుని.. కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన బాలీవుడ్ నటి సాధనా శివదాసాని. అప్పట్లో ఆమె హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ స్టయిల్ ఫ్యాషన్ ట్రెండ్‌గా ఉండేది. 

సాధన 1941 సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌లోని కరాచీలో సింధ్ కుటుంబం లో జన్మించింది. దేశ విభజన సమయంలో సాధన కుటుంబం పాకిస్తాన్ నుంచి ముంబయికి వచ్చి స్థిరపడ్డది. సాధనకు చిన్నప్పటి నుంచే నటి కావాలన్నది కోరిక. సింధీ కాలేజీలో చదువుతున్న సమయంలో ఒక నాటకంలో నటించడంలో మూవీ ఆఫర్ వచ్చింది. సింధీ మూవీ అయిన ‘అబానా’లో మొదటిసారి నటించింది.

ఆ మూవీ ప్రకటన పేపర్లో రావడంతో.. ఎస్.ముఖర్జీ (నిర్మాత) అది చూసి సాధనను సంప్రదించారు. అలా ‘లవ్ ఇన్ సిమ్లా’ ద్వారా కెమెరా ముందుకు వచ్చింది. తర్వాత రాజ్ కపూర్ ‘శ్రీ 420’ లోని ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ పాటలో కోరస్ గర్ల్‌గా కనిపించింది సాధన.. అలా బాలీవుడ్‌లోకి అరంగ్రే టం చేసింది.

అప్పట్లో సాధన ట్రెండ్‌కు జనాదరణ బాగా ఉండేది. ‘సాధన కట్’ అనేది ఒక ట్రెండ్‌గా మారింది. తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ భానూతో కలిసి ‘ఫ్యూజన్ చుడీదార్స్’ ను పరిచయం చేశారు సాధన. అలా ఒకసారి యష్ చోప్రా.. సాధన వేసుకున్న బట్టలు చూసి బాగుండటంతో.. సాధనతో కలిసి మాట్లాడి ఆ తరహా చుడీదార్లనే ‘వక్త్’ మూవీలో వాడారు. తర్వాతి కాలంలో దర్శకుడు నాయర్‌తో ఆమె ప్రేమలో పడి, కొన్నేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు.

1960, 70 దశకాల్లో సాధన తన నటనతో యువతను ఉర్రూతలూగించింది. సాధన నటించిన చిత్రా ల్లో ‘వో కౌన్ థీ’ ఆమె కెరీర్‌కి మలుపుతిప్పింది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ‘గీతా మేరా నామ్’ అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. 1960లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందారు. పరాఖ్, హమ్ దోనో, ప్రేమ్ పత్రా, అసలీ ఏక్ ముసాఫిర్ ఏక్ హసినా, దుల్హా దుల్హన్, దిల్ దౌలత్ దునియా, ఛోటే సర్కార్ తదితర సినిమాల్లో నటించారు.

అప్పట్లో నందా, బబిత, సైరా బాను, ఆశా పరేఖ్, షర్మిలా టాగోర్ వంటివారు సాధనతో పోటీ పడ్డారు. టాప్ హీరోలు అయిన దేవానంద్, రాజేంద్ర కుమార్, షమ్మీ కపూర్, రాజ్ కుమార్, మనోజ్ కుమార్ సరసన నటించారు. సాధన హీరోయిన్‌గా నటించిన ‘మేరా సాయా’, పరఖ్, ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా, మేరే మహబూబ్, ఓ కౌన్ థీ, వక్త్ ఘన విజ యం సాధించాయి. రొమాంటిక్ పాటలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు సాధన.

‘జహా మే ఐసా కౌన్ హై’, ‘లగ్ జా గలే’, ‘మేరా సాయా సాథ్ హోగా’, ‘నైనేం మే బదరా ఛాయే’ వంటి పాటలు హిట్. సాధనవి ఎంతో అందమైన కళ్లు.. మేరే మహబూబ్ చిత్రంలో బుర్ఖాలోంచి కనిపించే ఆమె కాటుక కళ్లను ఎందరో ప్రేక్షకులు అభిమానించేవారు. సాధనకి ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు.

ఒకరోజు చీరలు కొన డానికి వెళ్తే.. అక్కడ దాదాపు ఐదు వేల మంది పోగయ్యారు. 1995లో ఆమె భర్త ఆర్.కె. నాయర్ మరణించారు. సాధనకు పిల్లలు లేకపోవడంతో ఒక పాపని దత్తత తీసుకున్నది. నోటి క్యాన్సర్‌తో  సాధన 25 డిసెంబర్ 2015లో కన్నుమూసింది.

సాధన కట్

౬౦వ దశకంలో ‘సాధన కట్’ ఓ ఫ్యాషన్. ౧౯౫౩ క్లాసిక్ ఫిల్మ్ ‘రోమన్ హాలిడే’లో ప్రపంచాన్ని అబ్బురపరచిన ఆండ్రీ హెబ్బర్న్ లా సాధన హెయిర్ స్టుల్ హిందీ సినిమా ప్రేక్షకులను కూడా ఆకర్షించింది. విప్పారిన నేత్రాలు, సన్నని నవ్వు, నుదుటిపైకి జారిన జుట్టుతో సాధన ఓ కల్ట్ ఫిగర్‌లా మారింది. విశాలమైన నుదుటిపై ఆమె జుట్టు స్టుల్ దేశంలో అమ్మాయిలు అనుకరించడం మొదలుపెట్టారు.

బరైలీలో ఝంకా

మేరా సాయా చిత్రంలో ‘ఝంకా గిరా రే బరైలీ కీ బాజా ర్ మే’ అనే పాటలో సాధనలోని చిలిపితనాన్ని మరచిపోలేం. బరైలీలో కిందపడిపోయిన ఝంకా కోసం ఎంత మంది వెదికారో కానీ. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం పద్నాలుగు అడుగుల ఎత్తులో ఝంకా ఏర్పాటు చేసింది. రంగురాళ్లు, జరీ ఎంబ్రాయిడరీతో ఈ పెద్ద ఝంకా ఆనాటి సాధన తీపిగుర్తు.