పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో వాదనలు
విచారణ గురువారానికి వాయిదావేసిన హైకోర్టుసీఎంపై కేసు నమోదుకు ఆదేశించలేం
ఎర్రోళ్ల శ్రీనివాస్ పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఓ బహిరంగ సభలో చేసిన ప్రసంగ విమర్శల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేయాలని కోరిన బీఆర్‌ఎస్ నేత పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పింది. సీఎంగా పలు సమాశాల్లో అనేక అంశాలపై ప్రసంగాలు చేస్తుంటారని, వాటిని తప్పుగా పరిగణించి కేసులు నమోదుకు ఉత్తర్వుల జారీకి ఆస్కారం లేదని తేల్చింది. రాజకీయ నేతల మాటలపై ఇలాంటి పిటిషన్లను విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీచేయడం మొదలుపెడితే కోర్టులకు వేరే కేసులతో పని ఉండదని వ్యాఖ్యానించింది.
సీఎం మాట్లాడిన మాటలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా లేవని, అందుకే ఆదిలోనే పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గత నెల 6న మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు చేయడంపై గత అక్టోబరు 22న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పాలమూరు సభ లో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని అన్నారు. కేసు నమోదు చేసేలా అదేశాలివ్వాలని కోరారు. సీఎంపై పిటిషన్ దాఖలు చేయడానికి పిటిషనరుకు అర్హత లేదని, ఈ పిటిషన్ విచారణార్హం కాదని పేర్కొంటూ న్యాయమూర్తి బుధవారం తుది ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే పిటిషన్ల విషయంలో స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులకు, ఈ రెండు కోర్టులు కింది కోర్టులకు ఫలనా కేసును నిర్ధిష్ట గడువులోగా విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వుల జారీ చేసే వెసులుబాటు రాజ్యాంగంలో ఉందని, ఆవిధంగా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదని ఫిరాయింపుదారుల తరఫు న్యాయవా దులు వాదించారు.
పదో షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరించే స్పీకర్‌కు ఉత్తర్వుల జారీకి వీల్లేదన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ౪ వారాలు గడువిస్తున్నామని, అప్పటిలోగా విచారణ అంశంపై తగిన నిర్ణయం తీసుకోని పక్షంలో తామే ఉత్తర్వులు జారీచేయాల్సి వస్తుందంటూ గత సెప్టెంబర్ 9న స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం ఎదుట బుధవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి.
అసెంబ్లీ కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాత్సవ, పీ శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి ఇతరులు వాదిం చారు. రాజ్యాంగపరంగా ఉన్నతమైన స్పీకర్ పదవిని నిర్వహిస్తూ ట్రిబ్యునల్ చైర్మన్‌కు పార్టీ ఫిరాయింపుల కేసులను నిర్ధిష్ట వ్యవధిలోగా విచారణ పూర్తి చేయాలనే ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆమోదిస్తే, రేపు స్పీకర్ చట్టసభలో ఏవిధంగా నిర్ణయాలు తీసుకోవాలో కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు.
స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో పార్టీ ఫిరాయింపుల వివాదంపై తుది ఉత్తర్వులు జారీచేసిన తర్వాతే న్యాయ సమీక్షకు వీలుందని చెప్పారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. వాదనలు గురువారం కొనసాగనున్నాయి.