27-04-2025 11:06:12 AM
హైదరాబాద్: ఏసీబీ అధికారులు నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్(EX ENC Hariram)ను రిమాండ్ కు తరలించారు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో హరిరామ్ కు రూ. వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. హరిరామ్ పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేశారు. గజ్వేల్ లో భారీగా చట్టవిరుద్ధమైన ఆస్తులను అధికారులు గుర్తించారు. హరిరామ్, అతని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ దాడులు చేసింది. ప్రస్తుతం ఉంటున్న షేక్ పేట్ లో రెండు విల్లాలు, కొండాపూర్ లో విల్లా గుర్తించారు.
హరిరామ్ కు శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ లో ఫ్లాట్లు, అమరావతిలోనూ వాణిజ్యస్థలం ఉన్నట్లు సోదాల్లో తెలింది. మార్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరులో 20 గుంటలు, శ్రీనగర్ లో రెండు ఇళ్లు, 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్, కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ఓపెన్ ఫ్లాట్లు, ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హరిరామ్ నుంచి పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లు, బీఎండబ్ల్యూ కారుతో సహా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి హరిరామ్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు జడ్జి ఇంట్లో ప్రవేశపెట్టారు. జడ్జి హరిరామ్ కు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఏసీబీ అధికారులు ఆయనను జైలుకు తరలించారు. హరిరామ్ కు చెందిన మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.