జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద కేసులో ఇరికించారని రాహిల్ పిటిషన్
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): 2022లో జరిగిన జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద కేసులో తనను కావాలని ఇరికిస్తున్నారని, రాజకీయ కక్షతోనే కేసులో నిందితుడిగా చేర్చారంటూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు మహ్మద్ ఆమిర్ రాహిల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రాహిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురవారం ఇరుపక్షాల వాదనలు పూర్తవ్వడంతో తీర్పును తర్వాత చెప్తామని జస్టిస్ కే సుజన వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తనను నిందితుడిగా పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌కు కింది కోర్టు అనుమతి ఇవ్వడాన్ని రాహిల్ హైకోర్టులో సవాల్ చేశారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ వాదిస్తూ, రాజకీయ కక్షతో పిటిషనర్‌ను కేసులో ఇరికిస్తున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాద కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి చార్జిషీట్ దాఖలు చేశారని, రెండేళ్ల తర్వాత పోలీసులు కావాలని పిటిషనర్‌ని నిందితుడిగా చేర్చారని అన్నారు. కింది కోర్టు అనుమతించడం చెల్లదని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్లీడర్ ప్రతివాదన చేస్తూ బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని పిటిషనర్ కేసు నుంచి తప్పించుకున్నారని అన్నారు. రాజకీయ కక్ష అని చెప్పి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చెల్లవని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ఇప్పటికే కింది కోర్టులో విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.