03-05-2024 12:30:27 AM
న్యూఢిల్లీ, మే 2: లిక్కర్ పాలసీ కుంభకోణంలో తీహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఆమె కూడా ఒకరని, కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉన్నదని ఈడీ న్యాయవాది వాదించారు. ఈ వాదనను కవిత తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఇప్పటికే కవితను ఈడీతోపాటు, సీబీఐ కూడా పలుమార్లు విచారించిందని, ఇక కొత్తగా ప్రశ్నించాల్సిందేమీ లేదని తెలిపారు. అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తీర్పును 6వ తేదీకి వాయిదా వేసింది.