హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనల ఉల్లంఘన కేసులో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వేర్వేరుగా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశాయి. మార్గదర్శిపై విచారణ చేపట్టి.. క్రిమినల్ చర్యలకు సూచనలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో ఏపీప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలంది.
రూ.5.15 కోట్లు ఉన్న ఎస్క్రో ఖాతాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లేదా రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి బదిలీ చేయాలని కోరింది. కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు ఆ మొత్తాన్ని ఖాతాదారులకు పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపింది. హైకోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని, తీర్పుకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేసింది.
మార్గదర్శి కేసుపై శుక్రవారం జస్టిస్ శ్యామ్‌కోషి, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం విచారణకు వచ్చింది. గతంలో మార్గదర్శి కేసులకు న్యాయవాదిగా వ్యవహరించినందున విచారణ చేపట్టేందుకు జస్టిస్ నర్సింగ్‌రావు నిరాకరించారు. దీంతో విచారణ వాయిదా పడింది.
రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018, డిసెంబర్ 31న తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, నాటి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి.
అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024, ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును రద్దు చేసింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలపై విచారణ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.