- రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, మజ్లిస్ కుమ్మక్కు
- మోదీని ఓడించాలనే కుట్రతోనే రెండు పార్టీలు ఏకం
- ఎన్డీఏకు వ్యతిరేకంగా అంతర్జాతీయ శక్తులు ఐక్యం
- బీజేపీ నేతల మీటింగ్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బీజేపీని ఓడించాలనే కుట్రతో దేశ వ్యాప్తం గా కొన్ని అంతర్జాతీయ శక్తులు కుట్ర చేశాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యం గా సికింద్రాబాద్ పార్లమెంటులోని జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు (కాంగ్రెస్, ఎంఐఎం) ఏకమయ్యాయని ఆయన అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజే పీ ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (జూబ్లీహిల్స్, నాంపల్లి) బీజేపీకి మెజారిటీ రాలేదని అన్నారు.
నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎంతో అవగాహనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారమే నిర్వహించలేదని, పాదయాత్ర చేయలేదని, కనీసం సమావేశాలు నిర్వహించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ తరఫున ఇక్కడ ఎన్నికల ఎత్తుగడను అవలంభించడంలో కొంతవరకు విఫలమయ్యామని ఆయన అన్నారు. నాంపల్లి అసెం బ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 62 వేల ఓట్లు తగ్గాయన్నారు. అయి నా ప్రజల మద్దతుతో బీజేపీకి గతం కంటే ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచంలోని వివిధ దేశాధినేతలు ఆదరిస్తున్నారని... దీన్ని రాజకీ యంగా జీర్ణించుకోలేని కొన్ని శక్తులు కుట్రలకు తెరలేపాయని కిషన్ రెడ్డి అన్నారు.
వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశంలో ఎన్డీయేకు, దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ శక్తులు చాపకింద నీరులాగా పనిచేస్తున్నాయన్నారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, హ్యాట్రిక్ ప్రధానిగా పదవి అలంకరించిన ఘనత నరేంద్ర మోదీదేనన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కార్యక ర్తలందరూ ఎంతో కష్టపడ్డారని, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.