calender_icon.png 7 October, 2024 | 7:07 PM

హీరోయిన్‌గా జర్నీ షురూ

06-10-2024 12:00:00 AM

ఎన్నో విజయవంతమైన సినిమాల్లో చక్కగా నటించి బాలనటిగా పేరు సంపాదించుకుందీ చిన్నది.. దేశంలోకెల్లా అత్యధికంగా ఆర్జించిన (రూ.10 కోట్లు) బాలనటిగానూ రికార్డుకెక్కిందీ నవ సౌందర్యరాశి.. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’లో యువ నందిని (ఐశ్వర్యరాయ్ యుక్త వయసు పాత్ర) మెప్పించిందీ కొత్తందం. ఆ బాలనటి సారా అర్జున్.. ఇప్పుడు యువ కథానాయిక.

అంతేనా? ఓ బాలీవుడ్ స్టార్ హీరోతోనే జత కట్టే అవకాశాన్నే కొట్టేసింది! ఔను, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుందీ చిన్నది. ప్రముఖ దర్శక నిర్మాత ఆదిత్య దోర్ తెరకెక్కిస్తున్న ఈ హిందీ చిత్రంలో రణ్‌వీర్, సార నాయకానాయికలుగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఆర్.మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితర స్టార్ హీరోలు కూడా భాగమవుతున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా, రణ్‌వీర్ జంట గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సారా అర్జున్ వయసు 19 ఏళ్లు. అనుభవజ్ఞుడైన రణ్‌వీర్ సరసన సారను చూడగలమా? అనే విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషా చిత్రాల్లో బాల నటిగా గుర్తింపు తెచ్చుకున్న సార.. యుక్త వయసులోకి రావడంతో హీరోయిన్‌గా ఆఫర్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఏకంగా రణ్‌వీర్ సింగ్ చిత్రంలోనే అవకాశం దక్కించుకోవడం ద్వారా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు తెర తీసింది.