22-03-2025 02:05:21 AM
రెండు రోజులుగా దీక్షలు సంఘీభావం తెలిపిన రాజకీయ, కుల సంఘాలు
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 21 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెం గంగాబిషన్ గతంలో కేటాయించిన పది ఎకరాల స్థలంలో గత రెండు రోజులుగా జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. వారి న్యాయమైన డిమాండ్కు మద్దతుగా శుక్రవారం వివిధ రాజకీయ పక్షాల నేతలు, కుల సంఘాల నాయకులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు.
ప్రభుత్వం తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించి, నిర్మాణానికి రూ 5 లక్షలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే కొత్తగూడెంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికి ,ఆ స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 16 నెలలైనా జర్నలిస్టులో కేటా యించకుండా మోసం చేస్తుందని ఆరోపించారు.
ఆదివాసి సంఘం ఐకాసా రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరానికి రూ 2.50 కోట్లు చెల్లించి తీసుకోవాలనడం సరైనది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ పేరకు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని, లేనిపక్షంలో ఆదివాసి ఐకాసా ఆధ్వర్యంలో జర్నలిస్టుల తరఫున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం, బిజెపి నాయకులు కె.వి రంగా కిరణ్ లు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు జునుమాల రమేష్, కల్లోజు శ్రీనివాస్, టీవీ నాగచారి, సతీష్, జాన్సన్, సింగం అరుణ్ కుమార్, జోగాం తారక్, వట్టి కొండ రవి, ఈశ్వర్ రుద్ర రాజశేఖర్ పాల్గొన్నారు.